అదనంగా 10 విమానాలు.. 1000 నియామకాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో పది విమానాలను పెంచుకోవడంతో పాటు 1,000 మంది సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉందని విస్తారా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Published : 09 Jun 2023 02:14 IST

2023-24పై విస్తారా

ఇస్తాంబుల్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో పది విమానాలను పెంచుకోవడంతో పాటు 1,000 మంది సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉందని విస్తారా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అమెరికాకు విమాన సర్వీసులు నడపాలనే ప్రణాళికను పక్కకు పెట్టినట్లు తెలిపారు. త్వరలో ఎయిరిండియాలో విలీనం కానున్న విస్తారా వద్ద ప్రస్తుతం 61 విమానాలు ఉండగా.. సుమారు 5,200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. నియామకాల కోసం నిపుణుల లభ్యత ఉందని.. ముఖ్యంగా గోఫస్ట్‌ కార్యకలాపాలు నిలిచినందున, ఆ సంస్థలో పనిచేస్తున్న పైలట్లు, కేబిన్‌ సిబ్బందిని నియమించుకునే అవకాశం ఏర్పడిందని విస్తారా సీఈఓ వినోద్‌ కన్నన్‌ తెలిపారు. ‘ఎయిరిండియా, ఇండిగో మాదిరే మేమూ వాళ్లను నియమించుకుంటాం. సరైన సంఖ్యలో, సరైన వ్యక్తులను నియమించుకోవాలని అనుకుంటున్నాం. ఇందుకు సాధారణంగా ప్రతి విమానయాన సంస్థ అనుసరించే మార్గాన్నే మేమూ పాటిస్తామ’ని ఆయన తెలిపారు.

* గోఫస్ట్‌ నుంచి 50 మంది పైలట్లను విస్తారా నియమించుకుంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 10 విమానాలను పెంచుకుంటాం. ఇందులో ఒకటి ఇప్పటికే రాగా.. మిగతా తొమ్మిది త్వరలోనే వస్తాయి. వీటిల్లో 3 వైడ్‌ బాడీ విమానాలు. మిగతావి ఏ320 విమానాల’ని ఆయన వివరించారు. చాలా విమానాలు కావాల్సి ఉండటం వల్లే, అమెరికాకు విమాన సర్వీసులను నడపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని