వాల్యూఫస్ట్‌ను సొంతం చేసుకున్న తాన్లా ప్లాట్‌ఫామ్స్‌

తాన్లా ప్లాట్‌ఫామ్స్‌, అమెరికాలోని ట్విలియో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాల్యూఫస్ట్‌ డిజిటల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వాల్యూఫస్ట్‌)ను సొంతం చేసుకోనుంది.

Published : 09 Jun 2023 02:18 IST

లావాదేవీ విలువ రూ.346 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: తాన్లా ప్లాట్‌ఫామ్స్‌, అమెరికాలోని ట్విలియో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాల్యూఫస్ట్‌ డిజిటల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వాల్యూఫస్ట్‌)ను సొంతం చేసుకోనుంది. నూరు శాతం వాటాను 42 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.346 కోట్ల)కు కొనుగోలు చేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ గురువారం ఇక్కడ వెల్లడించింది. కొన్ని సర్దుబాట్లకు లోబడి 2.5 - 3.5 మిలియన్‌ డాలర్ల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని సంస్థ వివరించింది. ఈ లావాదేవీ వచ్చే నెలలో పూర్తి కావచ్చని పేర్కొంది.

ఇదే కాకుండా వాల్యూఫస్ట్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఎఫ్‌జడ్‌సీ అనే కంపెనీలో సైతం నూరు శాతం వాటాను రూ.20 కోట్లకు తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

ఈ రెండు సంస్థల ద్వారా ఏటా దాదాపు రూ.950 కోట్ల ఆదాయం, రూ.52 కోట్ల ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) లభిస్తుందని తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ తెలిపింది.

సీపాస్‌ (కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ యాస్‌ ఏ సర్వీస్‌) సేవల్లో వాల్యూఫస్ట్‌ క్రియాశీలక సంస్థగా ఉంది. దాదాపు వెయ్యికి పైగా సంస్థలకు ఇది సేవలు అందిస్తోంది. వాల్యూఫస్ట్‌ను కొనుగోలు చేయటం వల్ల సీపాస్‌ సేవల మార్కెట్లో 45% తమ చేతికి వచ్చినట్లు అవుతుందని తన్లా ప్లాట్‌ఫామ్స్‌ పేర్కొంది.  వాట్సప్‌ వంటి ఇతర కీలక విభాగాల్లోనూ వాటా పెంచుకునే అవకాశం లభిస్తుంది. గతంలో కారిక్స్‌ అనే సంస్థను కొనుగోలు చేయడం వల్ల గత అయిదేళ్లలో తమ ఆదాయాలు బాగా పెరిగాయని, భవిష్యత్తులో వాల్యూఫస్ట్‌ ద్వారా అదే రకమైన అవకాశం తమకు లభిస్తుందని తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ సీఈఓ ఉదయ్‌ రెడ్డి పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని