వడ్డీ రేట్లలో ఈసారీ మార్పులేదు

మూడేళ్ల పాటు అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా, భారత్‌లో మాత్రం వృద్ధి పుంజుకుంది. ధరలు కూడా అదుపులోకి వస్తున్నాయి. అయినా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని గరిష్ఠ లక్ష్యమైన 4 శాతం లోపునకు పరిమితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

Published : 09 Jun 2023 05:02 IST

ద్రవ్యోల్బణంపై ఆధారపడే భవిష్యత్తు నిర్ణయాలు
రూ.1.8 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చాయ్‌
‘సెటిల్‌మెంట్ల’కు సహకార బ్యాంకులకూ అనుమతి
‘మోసపూరిత ఖాతా’లపై సవరించిన మార్గదర్శకాలు త్వరలో
విదేశాల్లో వాడుకోవడానికి వీలుగా రుపే కార్డులు
ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

మూడేళ్ల పాటు అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా, భారత్‌లో మాత్రం వృద్ధి పుంజుకుంది. ధరలు కూడా అదుపులోకి వస్తున్నాయి. అయినా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని గరిష్ఠ లక్ష్యమైన 4 శాతం లోపునకు పరిమితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ధరలతో పాటు ఆర్థిక స్థిరత్వానికి ఎదురయ్యే సవాళ్ల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. 2022 ఏప్రిల్‌ నుంచి రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర పెంచిన ప్రభావం రాబోయే నెలల్లో కనిపిస్తుంది.

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: వరుసగా రెండో ద్రవ్య, పరపతి విధాన సమీక్షలోనూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. దీనితో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులకు మాత్రమే పరిమితమైన రుణాల రైటాఫ్‌ (సాంకేతిక రద్దు)నకు సహకార బ్యాంకులకూ అనుమతినిచ్చింది. విదేశాల్లో వాడుకునేందుకు వీలుగా రుపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులను జారీ చేయడానికి బ్యాంకులను అనుమతిస్తోంది. మోసపూరిత ఖాతా వర్గీకరణకు త్వరలో సవరించిన మార్గదర్శకాలను జారీ చేస్తామని ప్రకటించింది.

* వృద్ధికి సహకరిస్తూనే.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఆర్‌బీఐ తన తాజా పరపతి విధాన సమీక్షలో సంకేతాలిచ్చింది. కమొడిటీ ధరలు అదుపులోకి వస్తున్నందున, అంతర్జాతీయంగా పలు కేంద్ర బ్యాంకులు రేట్ల పెంపును నిలిపివేశాయి. ఆస్ట్రేలియా, కెనడా మాత్రం రేట్లను మళ్లీ పెంచుతున్నాయి. మన కేంద్రబ్యాంక్‌ మాత్రం ‘ధరలు మరీ గణనీయంగా పెరగకపోతే ఎక్కువ కాలం పాటు రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది (2023)లో వడ్డీరేట్ల తగ్గింపూ ఉండదనే భావనను వ్యక్తం చేస్తున్నారు.

* కీలక రెపో (బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) రేటును మార్పు లేకుండా 6.5 శాతం వద్దే ఉంచడానికి 3 రోజుల పాటు జరిపిన సమీక్ష అనంతరం, పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. జూన్‌లో రోజు వారీగా సగటున రూ.2.3 లక్షల కోట్ల మేర ద్రవ్యలభ్యత కనిపించడంతో.. గతేడాది ఏప్రిల్‌లో మొదలుపెట్టిన ‘సర్దుబాటు ధోరణిని వెనక్కి తీసుకునే’ ధోరణిని కొనసాగించడానికి 5-1 తేడాతో సభ్యుల ఆమోదం లభించింది. ప్రభుత్వ వ్యయాలు పెరగడం, చెలామణీలో కరెన్సీ తగ్గడం ద్రవ్యలభ్యత పెరగడానికి కారణమయ్యాయి.

ద్రవ్యోల్బణం, వృద్ధిపై అంచనాలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనా 6.5 శాతంలో మార్పు చేయలేదు. (వరుస నాలుగు త్రైమాసికాల్లో 8%, 6.6%. 6%, 5.7 శాతం చొప్పున వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది) గతేడాది 7.2% వృద్ధిరేటుతో, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించిన పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మనదేశం నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాను 5.2% నుంచి 5.1 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. అంటే వచ్చే మార్చి వరకు ద్రవ్యోల్బణం 4 శాతం ఎగువనే కొనసాగుతుందని అంచనా వేసింది.

విధాన చర్యలన్నీ.. దానిపైనే..

ద్రవ్యోల్బణం ఆధారంగానే భవిష్యత్తు విధాన చర్యలుంటాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం తగ్గడమే కీలకమని అన్నారు. రుతుపవనాల పురోగతి, ఎల్‌నినో ప్రభావాన్ని గమనించాల్సి ఉందని పేర్కొన్నారు.


రూ.2,000 నోట్లు సగం మేర తిరిగొచ్చాయ్‌

చెలామణీలో ఉన్న రూ.2,000 నోట్లలో సగం వరకు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చేశాయని దాస్‌ తెలిపారు. మార్చి ఆఖరుకు రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణిలో ఉండగా.. వీటిని ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ మే 19న ప్రకటించింది. తదుపరి ఇప్పటివరకు రూ.1.8 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. రూ.500 నోట్లను ఉపసంహరించి, మళ్లీ రూ.1000 నోట్లు తెస్తారనే ఊహాగానాల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.


తదుపరి పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) సమావేశం
ఆగస్టు 8-10 తేదీల్లో  


రుపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులొస్తున్నాయ్‌

విదేశాల్లోని ఏటీఎంలు, పీఓఎస్‌ మెషీన్లతో పాటు ఆన్‌లైన్‌ చెల్లింపులు జరుపుకునేందుకు వీలుగా రుపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులను జారీ చేయడానికి బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చింది. రుపే డెబిట్‌, క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ కార్డులను విదేశాల్లో జారీ చేయడానికీ అనుమతించనున్నారు. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా వీటిని వినియోగించుకోవచ్చు.

* ఇ-రుపీ డిజిటల్‌ ఓచర్లను ఇకపై నాన్‌-బ్యాంక్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌(పీపీఐ) జారీదార్లు కూడా జారీ చేయొచ్చు. వ్యక్తుల తరఫున ఇ-ఓచర్లను జారీ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. రూ.10,000 పరిమితితో నిర్దిష్ట వ్యక్తి, నిర్దిష్ట అవసరానికి ఒకసారి వాడుకునేందుకు ఇ-ఓచర్లు ఉపయోగపడతాయి.


మోసగాడు ఎవరంటే..

ఎవరైనా ఒక ఎగవేతదారును ‘మోసగాడు’గా వర్గీకరించే ముందు సహజసిద్ధమైన న్యాయాన్ని పాటించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. త్వరలోనే మోసపూరిత ఖాతాల వర్గీకరణకు సవరించిన మార్గదర్శకాలను ఆర్‌బీఐ జారీ చేయనుంది.


డిజిటల్‌ రూపాయికి క్యూ ఆర్‌ కోడ్‌

యూపీఐతో పరస్పరం పనిచేసేలా కేంద్ర బ్యాంకు తన డిజిటల్‌ కరెన్సీ (సీడీడీసీ)కి క్యూఆర్‌ కోడ్‌లను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. సీబీడీసీకి ఈ నెలాఖరుకల్లా 10 లక్షల మంది యాక్టివ్‌ వినియోగదార్లను సంపాదించాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

* సామాజిక మాధ్యమాల్లో ఇన్‌ఫ్లూయెన్సర్లపై నియంత్రణ చేపట్టేందుకు విడిగా ఎటువంటి నిబంధనలనూ జారీ చేయాలని భావించడం లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటికే ఆర్థిక మార్కెట్లపై వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకునేవారిపై సెబీ దృష్టి సారించినట్లు గుర్తు చేసింది.


సహకార బ్యాంకులూ రైటాఫ్‌ చేయొచ్చు

రుణ ఎగవేతదార్లతో సెటిల్‌మెంట్‌తో పాటు సాంకేతికంగా రద్దు (రైటాఫ్‌) చేయడానికి సైతం సహకార బ్యాంకులకు త్వరలోనే అనుమతులు రానున్నాయి. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పరిష్కార ప్రణాళికను మరింత విస్తృతం చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించడం ఇందుకు నేపథ్యం. ఇప్పటి దాకా ఈ అధికారం షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లకే ఉండేది. ఈ అంశంపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని