సంక్షిప్త వార్తలు(5)

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ, విదేశీ మార్కెట్ల నుంచి రుణ పద్ధతుల ద్వారా రూ.50,000 కోట్ల వరకు సమీకరించనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది.

Updated : 10 Jun 2023 05:40 IST

ఎస్‌బీఐ రూ.50,000 కోట్ల సమీకరణ యత్నాలు

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ, విదేశీ మార్కెట్ల నుంచి రుణ పద్ధతుల ద్వారా రూ.50,000 కోట్ల వరకు సమీకరించనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. బ్యాంక్‌ కేంద్ర బోర్డు ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఈ నిధుల సమీకరణ ఉంటుందని తెలిపింది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో రూ.6123 కోట్ల వాటా విక్రయం: బహిరంగ మార్కెట్‌ లావాదేవీ ద్వారా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో దాదాపు 1.7% వాటాను రూ.6,123 కోట్లకు కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు విక్రయించింది. బీఎస్‌ఈలో బల్క్‌ లావాదేవీల సమాచారం ప్రకారం.. కోటక్‌ బ్యాంక్‌ ఒక్కో షేరును సగటున రూ.1,855.64 చొప్పున  3.30 కోట్ల షేర్లను విక్రయించారు. లావాదేవీ తర్వాత కోటక్‌ బ్యాంక్‌లో కెనడా పెన్షన్‌ ప్లాన్‌ వాటా 4.34% నుంచి 2.68 శాతానికి తగ్గింది.


అమెరికాకు కోడ్‌షేర్‌ విమానాలు: ఇండిగో

దిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచుకునే యత్నాల్లో ఉన్న ఇండిగో.. ఇస్తాంబుల్‌ ద్వారా అమెరికాకు కోడ్‌షేర్‌ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకుగాను తుర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌తో కోడ్‌షేర్‌ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా జూన్‌ 15 నుంచి న్యూయార్క్‌, బోస్టన్‌, చికాగో, వాషింగ్టన్‌కు విమాన సర్వీసులను అనుసంధానం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా.. ఇప్పటికే 33 గమ్యస్థానాలకు ఇండిగో కోడ్‌షేర్‌ ద్వారా విమాన సర్వీసులను అందిస్తోంది. ఒక విమానయాన సంస్థకు ఫలానా గమ్యస్థానానికి నేరుగా సర్వీసులు లేకపోయినా.. తన ప్రయాణికులు తన భాగస్వామి సంస్థ విమానాల ద్వారా ఆ గమ్యస్థానానికి ప్రయాణించేందుకు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వీలును కోడ్‌ షేరింగ్‌ సదుపాయం కల్పిస్తుంది.

* అక్టోబరు కల్లా లీజింగ్‌ ద్వారా మరో 10 న్యారో బాడీ బోయింగ్‌ (బీ737) విమానాలు తమకు అందుబాటులోకి వస్తాయని స్పైస్‌జెట్‌ తెలిపింది.


రూ.1,500 కోట్ల సమీకరణలో ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: రుణాల్లో పెరుగుతున్న వృద్ధిని అందుకునేందుకు బ్యాంకింగేతర రుణ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.1,500 కోట్లను సమీకరించనుంది. శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ బాండ్ల ద్వారా ప్రాథమికంగా రూ.300 కోట్లను సమీకరించాలన్నది లక్ష్యమని, అధికంగా వచ్చిన పెట్టుబడులను రూ.1,200 కోట్ల వరకూ తీసుకునేందుకు గ్రీన్‌ షూ ఆప్షన్‌ను వినియోగించుకుంటామని సంస్థ వివరించింది. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచకుండా విరామం ప్రకటించినప్పటికీ, అయిదేళ్ల వ్యవధి ఎన్‌సీడీలకు 9 శాతం కూపన్‌ రేటును అందిస్తున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ తెలిపింది. కొవిడ్‌ తర్వాత రుణాలకు గిరాకీ అధికంగా ఉందని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ రాంలీలా తెలిపారు. సమీకరించిన నిధులతో రుణాల వితరణ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కో ఎన్‌సీడీ ముఖ విలువ రూ.1,000. కనీసం రూ.10,000 మదుపు చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల వ్యవధికి 8.35 శాతం, 36 నెలల వ్యవధి ఎన్‌సీడీలపై 8.50 శాతం కూపన్‌ రేటు లభిస్తుంది. 60 నెలల వ్యవధికి పెట్టుబడి పెట్టిన వారు నెలకోసారి వడ్డీని తీసుకునే అవకాశం ఉంది. అపుడు కూపన్‌ రేటు 8.65 శాతంగా ఉంటుందని ఐఐఎఫ్‌ఎల్‌ వెల్లడించింది. ఈ నెల 22 వరకూ ఈ ఎన్‌సీడీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.


నల్లటి పాంటు, పోలో టీ షర్టు

కొద్ది రోజులు విస్తారా సిబ్బంది యూనిఫామ్‌ ఇదే

దిల్లీ: విస్తారా ఎయిర్‌లైన్స్‌ సిబ్బందికి కొత్త చిక్కులు వచ్చాయి. సరఫరా వ్యవస్థలో సమస్య కారణంగా విస్తారా విమానాల్లో సేవలందించే కేబిన్‌ సిబ్బందికి యూనిఫామ్‌ల కొరత ఏర్పడింది. దీంతో తమ సిబ్బంది కొద్దిరోజులు వంకాయ రంగు దుస్తులకు బదులు, నల్లటి దుస్తుల్లో సేవలందిస్తారని, ఇందుకు ప్రయాణికులు సహకరించాలని విస్తారా సంస్థ ట్వీట్‌లో పేరొంది. ‘మా సంస్థ సర్వీసులను విస్తరించడంలో భాగంగా సిబ్బంది సంఖ్యను కూడా పెంచాం. అయితే, డిమాండ్‌కు తగిన సరఫరా లేని కారణంగా మా కేబిన్‌ సిబ్బందికి యూనిఫామ్‌ల కొరత ఏర్పడింది. కానీ, విమాన సర్వీసుల ద్వారా ప్రయాణికులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో యూనిఫామ్‌ లేకున్నా సిబ్బందిని విధులకు హాజరుకావాలని సూచించాం. ఇందులో భాగంగా కొద్ది రోజుల పాటు మా సిబ్బంది నల్లటి ప్యాంట్‌, విస్తారా లోగో ఉన్న పోలో టీ-షర్ట్‌లు ధరించి సేవలందిస్తారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు ముగింపు పలుకుతాం’ అని విస్తారా సంస్థ ట్వీట్‌ చేసింది.


సంక్షిప్తంగా

* బహిరంగ మార్కెట్‌ లావాదేవీ ద్వారా సెయిల్‌లో 2 శాతం వాటాకు సమానమైన 8.26 కోట్ల షేర్లను సగటున ఒక్కో షేరును రూ.66.18కు ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. దీంతో సెయిల్‌లో ఎల్‌ఐసీ వాటా 8.68 శాతానికి చేరింది.

* భారత్‌లో జీవిత బీమా వ్యాపారం నిర్వహించేందుకు గో డిజిట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు ఐఆర్‌డీఏఐ అనుమతి లభించింది. దీంతో దేశంలో జీవిత బీమా విభాగంలో కంపెనీల సంఖ్య 26కు పెరిగింది.

* మేలో జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియం ఆదాయం 4.1 శాతం తగ్గి రూ.23,477.8 కోట్లకు చేరినట్లు జీవిత బీమా మండలి గణాంకాలు వెల్లడించాయి. ఏడాది క్రితం ఇదే నెలలో సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం ఆదాయం రూ.24,480.36 కోట్లుగా ఉంది.

* పురుషుల గ్రూమింగ్‌ బ్రాండ్‌ ఉస్ట్రాను నిర్వహించే హ్యాప్పీలీ అన్‌మ్యారిడ్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను వెల్లడించని మొత్తానికి సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌ వీఎల్‌సీసీ కొనుగోలు చేసింది.

* దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న గోఫస్ట్‌ రుణదాతల కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే వారం ప్రారంభంలో కొత్త దివాలా పరిష్కార నిపుణుడు నియమితులయ్యే అవకాశం ఉంది. దీంతో సంస్థ పునరుజ్జీవ ప్రణాళికకు ఆమోదానికి మార్గం సుగమమైంది.

* సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌లో 14 శాతం వాటాను రూ.638 కోట్లకు ప్రమోటర్‌ సియోన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ విక్రయించింది.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు