కోనసీమ పవర్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్‌కు

ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంకరప్ట్సీ కోడ్‌- 2016 అమలు తీరుతెన్నులను పర్యవేక్షించే ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంకరప్ట్సీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది.

Published : 10 Jun 2023 04:33 IST

రూ.2 లక్షల జరిమానా ఐబీబీఐ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంకరప్ట్సీ కోడ్‌- 2016 అమలు తీరుతెన్నులను పర్యవేక్షించే ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంకరప్ట్సీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ఒక కంపెనీకి సంబంధించిన లిక్విడేషన్‌ ప్రక్రియలో ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్‌(ఐపీ) నిబంధనలకు విరుద్ధంగా  ఆస్తులను విక్రయించారనే ఆరోపణలపై విచారణ నిర్వహించింది. ఐఆర్‌పీ తప్పుచేసినట్లు నిర్ధారణ కావటంతో ఆయనకు రూ.2 లక్షల పెనాల్టీ విధించటంతో పాటు ఎక్కడైనా 4 నెలల పాటు ప్రొబేషనర్‌గా పనిచేసి చట్టంపై అవగాహన పెంచుకొనిరావాలని ఆదేశించింది.

ఇదీ జరిగింది..: కోనసీమ గ్యాస్‌ పవర్‌ లిమిటెడ్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టేందుకు ఎన్‌సీఎల్‌టీ 2018లో ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఈ కంపెనీని పునరుద్ధరించటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ‘లిక్విడేషన్‌’ ప్రక్రియ మొదలు పెట్టారు.  కానీ ఈ ప్రక్రియ తీరుతెన్నులపై ఆరోపణలు రావటంతో ఐబీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో కొన్ని లొసుగులు బయటకు వచ్చాయి. లిక్విడేషన్‌ ప్రక్రియను ఎదుర్కొంటున్న కంపెనీ ఆస్తులను వేలం ద్వారానే విక్రయించాలి. ప్రైవేటుగా విక్రయించరాదు. ఒకవేళ ప్రైవేటుగా విక్రయించదలచినా, అందుకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్‌ తప్పనిసరిగా పాటించాలి. వీటిని ఉల్లంఘిస్తూ, కోనసీమ గ్యాస్‌ పవర్‌కు చెందిన కార్బన్‌ క్రెడిట్‌లను, ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.48.84 లక్షలకు ప్రైవేటుగా విక్రయించారు. అంతేగాక కోనసీమ గ్యాస్‌ పవర్‌ ఆస్తులకు విలువ కట్టే సమయంలో ఈ కార్బన్‌ క్రెడిట్‌లకు పరిగణనలోకి తీసుకోలేదు. దీనికి బాధ్యుడైన ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్‌ సాయి రమేష్‌ కానుపర్తిని ఐబీబీఐ వివరణ కోరింది. దానికి ఆయన, సంస్థ ఆస్తులను ప్రైవేటుగా విక్రయించరాదనే విషయం తనకు తెలియదని బదులిచ్చారు. దీంతో ఆయన తప్పుచేసినట్లుగా ఐబీబీఐ నిర్ధారించి రూ.2 లక్షల పెనాల్టీ విధించింది. ఈ పెనాల్టీని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని