2023-24లో వృద్ధి 6.5 శాతం!

దేశీయ జీడీపీ వృద్ధి ఇప్పుడు పట్టణ గిరాకీతో మంచిగానే ఉందని, ఇదే సమయంలో గ్రామీణ గిరాకీ మందగించడం ఒకింత ఆందోళన కలిగించే అంశమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది.

Published : 10 Jun 2023 04:33 IST

అంచనాలను పెంచిన ఎస్‌బీఐ

కోల్‌కతా: దేశీయ జీడీపీ వృద్ధి ఇప్పుడు పట్టణ గిరాకీతో మంచిగానే ఉందని, ఇదే సమయంలో గ్రామీణ గిరాకీ మందగించడం ఒకింత ఆందోళన కలిగించే అంశమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జీడీపీ వృద్ధి అంచనాను 6.4 శాతం నుంచి 6.5 శాతానికి సవరించింది. 2023 ఏప్రిల్‌లో వృద్ధిని 6.4 శాతంగా ఎస్‌బీఐ అంచనా వేసింది. గురువారం ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాలు వెల్లడించిన తర్వాత ఎస్‌బీఐ వృద్ధి అంచనాను 6.5 శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఆర్‌బీఐ లక్ష్యిత 4 శాతం కంటే ఎగువనే నమోదు కావొచ్చని తెలిపింది. గత ఏడాది నుంచి వరుసగా రేట్ల పెంపు నిరుద్యోగిత రేటు తగ్గడానికి కారణమైందని పేర్కొంది. ఉపాధిలో క్షీణత లేకుండా అదనపు కార్మిక గిరాకీని కేంద్ర బ్యాంక్‌ తగ్గించగలిగిందని ఎస్‌బీఐ వివరించింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుతుండటం, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ తగ్గే అంచనాలుండటం గతంలో కేంద్ర బ్యాంక్‌ వరుసగా రేట్ల పెంపు ప్రతిఫలమే అని తెలిపింది. రుతుపవనాల ఆగమనం, ఎల్‌ నినో ప్రభావం వంటివి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో అధిక శాతం ఇబ్బందులు ఎదుర్కొంటాయని తెలిపింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం, బలహీన గిరాకీ, గడ్డు ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న అప్పులు వృద్ధిపై ప్రభావం చూపుతాయని అంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు