మదుపరులు వాడని సొమ్ము.. ఏ రోజుకారోజు వెనక్కి ఇవ్వండి

స్టాక్‌ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయడానికి మదుపరులు స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలకు బదిలీ చేసే నిధులకు సంబంధించి సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌  ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) సరికొత్త నిబంధనలను నిర్దేశించింది.

Published : 10 Jun 2023 04:34 IST

 స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలకు సెబీ నిర్దేశం
వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

ఈనాడు, హైదరాబాద్‌: స్టాక్‌ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయడానికి మదుపరులు స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలకు బదిలీ చేసే నిధులకు సంబంధించి సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌  ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) సరికొత్త నిబంధనలను నిర్దేశించింది. ఈ నిబంధనల ప్రకారం మదుపర్ల సొమ్ము స్టాక్‌ బ్రోకర్ల వద్ద ఉండటానికి వీల్లేదు. ఏ రోజుకారోజు మిగులు నిధులను స్టాక్‌ బ్రోకర్లు మదుపరులకు వెనక్కి ఇవ్వాల్సిందే.

ఇప్పటిదాకా..ఏం జరుగుతోందంటే..

ఇప్పటి వరకూ ఆ సొమ్ము.. తర్వాత రోజుల్లో మదుపరులు వాడుకునే వరకూ, లేదా వెనక్కి ఇవ్వాలని అడిగేవరకూ స్టాక్‌ బ్రోకర్ల వద్దే ఉంటూ వచ్చింది. ఇలా వేల కోట్ల రూపాయల సొమ్ము స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థల వద్ద ఉంటున్నట్లు, కొన్ని సంస్థలు ఆ సొమ్మును దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సెబీ భావించింది. స్టాక్‌ బ్రోకర్లు/ బ్రోకింగ్‌ సంస్థల వద్ద ఉన్న మదుపరుల సొమ్మును నెలకోసారి లేదా మూడు నెలలకోసారి వెనక్కి ఇవ్వాలనే నిబంధనలను కొద్దికాలం క్రితం సెబీ తీసుకువచ్చింది.

ఇకపై ఏం జరుగుతుందంటే..

ఇపుడు మరో అడుగు ముందుకేసి మదుపరులు వాడుకోకుండా స్టాక్‌ బ్రోకర్ల వద్ద ఉంచిన నిధులను ఏ రోజుకారోజు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని స్పష్టం చేస్తూ కొత్త నిబంధనలను తీసుకు వచ్చింది. కొన్ని ప్రత్యామ్నాయాలను కూడా సూచించింది. మదుపరుల సొమ్మును స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు వారికి వెనక్కి తిరిగి ఇవ్వటానికి బదులు క్లియరింగ్‌ కార్పొరేషన్‌ సభ్యులకు (క్లియరింగ్‌ మెంబర్‌) బదిలీ చేయవచ్చు. లేదా ఆ సొమ్మును బ్యాంకు డిపాజిట్‌ చేసి దాన్ని క్లియరింగ్‌ మెంబర్‌కు ‘లీన్‌’గా ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకనుకుంటే, మదుపరులకు వారు వాడుకోని సొమ్మును తిరిగి ఇచ్చేయాలి. ఈ నిబంధనలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) వ్యవహారంలో మదుపరులకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో సెబీ  ఈ  చర్యలను తీసుకుంటున్నట్లు స్టాక్‌బ్రోకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇబ్బందులు ఎదురుకావొచ్చు: బ్రోకింగ్‌ సంస్థలు

కానీ ఆచరణలో దీనికి సంబంధించి పలు రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక చిన్న, మధ్యస్థాయి బ్రోకింగ్‌ సంస్థలు ఇబ్బందులకు గురవుతాయని వివరిస్తున్నాయి. ‘కటాఫ్‌ టైమ్‌’ తర్వాత బ్రోకర్లకు మదుపరులు బదిలీ చేసే సొమ్మును ఎలా పరిగణించాలి? చెక్కు ద్వారా ఇస్తే పరిస్థితి ఏమిటి? రాత్రి 11 గంటల వరకూ కమొడిటీస్‌ ట్రేడింగ్‌ ఉన్నందున కమొడిటీస్‌లో క్రయవిక్రయాల కోసం క్లయింట్లు ఇచ్చిన సొమ్మును ఎలా  చూపించాలి? క్లియరింగ్‌ మెంబర్ల వద్ద పెట్టిన సొమ్మును శనివారం నాడు వెనక్కి ఇవ్వాలని మదుపరులు అడిగితే ఏం చేయాలి? అనే సందేహాలను స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు వెలిబుచ్చుతున్నాయి. ఈ సందేహాలకు స్టాక్‌  ఎక్స్ఛేంజీలు, సెబీ తగిన పరిష్కారాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు