వాట్సాప్‌ చాట్‌లోనే నేరుగా చెల్లింపులు

సంక్షిప్త సందేశం(మెసేజ్‌) పంపినంత సులువుగా చెల్లింపులు చేసేలా భారత్‌లో తమ చెల్లింపుల సేవలను విస్తరిస్తున్నట్లు బుధవారం మెటా నేతృత్వంలోని వాట్సాప్‌ ప్రకటించింది.

Updated : 21 Sep 2023 07:10 IST

బ్యాంకు ఖాతా తెరిచేందుకు, ఆహార పదార్థాల ఆర్డరుకూ వీలు

ముంబయి: సంక్షిప్త సందేశం(మెసేజ్‌) పంపినంత సులువుగా చెల్లింపులు చేసేలా భారత్‌లో తమ చెల్లింపుల సేవలను విస్తరిస్తున్నట్లు బుధవారం మెటా నేతృత్వంలోని వాట్సాప్‌ ప్రకటించింది. భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న వాణిజ్య విపణిలో వ్యాపార సంస్థలకు మరింత ఊతమివ్వడంలో భాగంగా వాట్సాప్‌ ఫ్లోస్‌, మెటా వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ లాంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. మెసేజింగ్‌ ద్వారా ప్రజలు, వ్యాపార సంస్థల మధ్య అనుసంధానంలో ప్రపంచంలోనే భారత్‌ ముందు వరుసలో నిలిచిందని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు.  

పోటీ యాప్‌ల్లోనూ..

‘వాట్సాప్‌ బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా భారత్‌లోని వ్యాపారులందరికీ మా చెల్లింపు సేవలను విస్తరిస్తున్నాం. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను కార్ట్‌లో చేర్చుకొని, వాటికి వాట్సాప్‌ లేదా ఇతర చెల్లింపు పద్ధతుల్లో(యూపీఐ యాప్‌లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు) చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం వేరే వెబ్‌సైట్‌లకు లేదా ఇతర యాప్‌ల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండద’ని కంపెనీ చెబుతోంది. వాట్సాప్‌కు పోటీ చెల్లింపు సేవల యాప్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి వాటితో కూడా ఆ యాప్‌ల్లోకి వెళ్లకుండానే నేరుగా చెల్లింపులు చేయొచ్చన్నమాట. మెసేజ్‌ పంపినంత సులభంగా చెల్లింపులు చేసేందుకు రేజర్‌పే, పేయూతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు వాట్సాప్‌ తెలిపింది.

త్వరలో వీళ్లకూ ‘మెటా వెరిఫైడ్‌’

వ్యాపార సంస్థల కోసం తీసుకొచ్చిన వాట్సాప్‌ ఫ్లోస్‌ సదుపాయం ద్వారా రిజర్వేషన్‌ బుకింగ్‌, ఆహార పదార్థాలకు ఆర్డరు ఇవ్వడం, ఫ్లైట్‌ చెకింగ్‌, బ్యాంకు ఖాతా తెరవడం లాంటి వాటిని వినియోగదార్లు వాట్సాప్‌లో చాట్‌ థ్రెడ్‌ ద్వారానే చేయొచ్చు. ఛాట్‌ థ్రెడ్‌లో నుంచి బయటకు వెళ్లకుండానే వీటన్నింటినీ పూర్తి చేయొచ్చు. అలాగే.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లోని వ్యాపార సంస్థలకు మెటా వెరిఫైడ్‌ను విస్తరించనున్నారు. దీని ప్రకారం వ్యాపారులు చందా రుసుము చెల్లించి వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ను, ఖాతా సహకారం, భద్రత, ప్రీమియం ఫీచర్లను పొందొచ్చు. రానున్న వారాల్లో ఎంపిక చేసిన దేశాల్లోని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోని వ్యాపార సంస్థలకు దీనిని అందుబాటులోకి తేనున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌కూ ఈ సేవలను విస్తరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని