అప్పులు చేసి మరీ.. ఆస్తులు కొంటున్నారు!

దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది.

Updated : 22 Sep 2023 07:21 IST

కుటుంబాల పొదుపు సగానికి తగ్గింది
రుణాలు రెండింతలయ్యాయ్‌
ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక
ముంబయి

దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. ఇది స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 5.1 శాతానికి సమానమని వెల్లడించింది. మరోవైపు కుటుంబాల రుణ భారం 2020-21 నుంచి రెండింతలు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఇందులో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు విశ్లేషించింది. నివేదిక ప్రకారం..

  • తగ్గిన పొదుపులో అధిక భాగం భౌతిక ఆస్తులకు మళ్లింది. 2022-23లో పెరిగిన రూ.8.2 లక్షల కోట్ల కుటుంబ రుణాల్లో రూ.7.1 లక్షల కోట్లు బ్యాంకుల నుంచే ఉన్నాయి. ఇందులోనూ అధిక భాగం గృహ రుణాలు, ఇతర రిటైల్‌ రుణాలు ఉన్నాయి.
  • 2022-23లో కుటుంబాల పొదుపు 50 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయి జీడీపీలో 5.1 శాతానికి తగ్గింది. 2020-21లో ఇది 11.5 శాతంగా ఉంది. కొవిడ్‌కు ముందు ఆర్థిక సంవత్సరం (2019-20)లో జీడీపీలో పొదుపు వాటా   7.6 శాతంగా నమోదైంది.
  • బీమా, భవిష్య నిధి, పింఛను నిధులకు కుటుంబాల నుంచి రూ.4.1 లక్షల కోట్ల మేర పెరిగాయి. గత రెండేళ్లలో కుటుంబాల రుణాల్లో 55 శాతం రిటైల్‌ రుణాలే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గృహ, విద్య, వాహన రుణాల వాటా ఉంది.
  • 2011-12 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపులో దాదాపు 2/3 వంతు పైగా ఆస్తుల్లోనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 48 శాతానికి తగ్గింది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ధోరణి మారుతోంది. ప్రజలు తిరిగి ఆస్తుల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. మళ్లీ ఇది 70 శాతానికి చేరే అవకాశం ఉంది.
  • కుటుంబాల రుణ భారం-జీడీపీ నిష్పత్తి కొవిడ్‌ సమయంలో పెరిగినా, తర్వాత నుంచి తగ్గుతోంది. 2020 మార్చిలో కుటుంబాల రుణాలు జీడీపీలో 40.7 శాతంగా ఉండగా, 2023 జూన్‌కు 36.5 శాతానికి దిగొచ్చాయి.

ఎలాంటి సంక్షోభం లేదు

-సీతారామన్‌

కుటుంబాల నికర ఆర్థిక పొదుపు తగ్గి, రుణ భారం పెరుగుతుండటంతో వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. స్థూలంగా దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, దీనిపై ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. ప్రజలు తమ పొదుపును ఇతర ఆర్థిక సాధనాల్లోకి పెట్టుబడులుగా మళ్లిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గణాంకాలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని, దేశంలో ఎలాంటి సంక్షోభానికి తావు లేదని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని