సంక్షిప్త వార్తలు(9)

కళామందిర్‌ పేరుతో దుస్తుల విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్‌ సంస్థ సాయి సిల్క్స్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు మంచి స్పందన లభించింది.

Published : 23 Sep 2023 01:37 IST

సాయి సిల్క్స్‌ ఐపీఓకు 4.4 రెట్ల స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: కళామందిర్‌ పేరుతో దుస్తుల విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్‌ సంస్థ సాయి సిల్క్స్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు మంచి స్పందన లభించింది. 3,84,86,309 షేర్లకు గాను 16,94,58,544 షేర్లకు బిడ్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. అంటే 4.4 రెట్ల వరకూ దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐపీఓ ద్వారా రూ.1,201 కోట్ల నిధులను సమీకరించనుంది. ఈ నిధులతో తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకలలో కొత్త విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తామని సంస్థ తెలిపింది.


ఎస్‌బీఐ రూ.10,000 కోట్ల సమీకరణ

ముంబయి: మౌలిక బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వెల్లడించింది. ఈ బాండ్లపై 7.49 శాతం వడ్డీ(కూపన్‌) రేటును చెల్లించనున్నట్లు పేర్కొంది. కాగా, ఎస్‌బీఐ మౌలిక బాండ్లను జారీ చేయడం ఇది నాలుగో సారి. ఇలా సమీకరించిన నిధులను మౌలిక రంగ ప్రాజెక్టులకు, అందుబాటు గృహ రంగానికి రుణాలుగా అందిస్తోంది. తాజా మౌలిక బాండ్ల ఇష్యూను రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎస్‌బీఐ ప్రారంభించింది. దీనికి ఐదు రెట్లకు పైగా స్పందన లభించిందని, రూ.21,045 కోట్ల విలువైన 134 బిడ్‌లు వచ్చాయని ఎస్‌బీఐ తెలిపింది.


ఎంఎస్‌ఎంఈల కోసం నియో ఫర్‌ బిజినెస్‌

అందుబాటులోకి తీసుకొచ్చిన యాక్సిస్‌ బ్యాంక్‌

ఈనాడు, హైదరాబాద్‌: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల కోసం ప్రత్యేకంగా నియో ఫర్‌ బిజినెస్‌ను ప్రారంభించినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. మారుతున్న వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. చెల్లింపుల్లో 28 శాతం నగదు, 72 శాతం డిజిటల్‌ విధానంలో జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, పేమెంట్‌ గేట్‌ వే, బల్క్‌ పేమెంట్స్‌ తదితరాలను నియో అందించనుంది. అన్ని వ్యాపార అవసరాలకు సరిపోయేలా, రోజులో ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఇది తోడ్పడుతుందని యాక్సిస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌, హోల్‌సేల్‌ బ్యాంకింగ్‌ ప్రోడక్ట్స్‌ హెడ్‌ నీరజ్‌ గంభీర్‌ అన్నారు. మొబైల్‌ బ్యాంకింగ్‌తోపాటు, ఇతర పద్ధతుల్లోనూ దీన్ని వినియోగించుకునే వీలుందన్నారు.


రేణిగుంటలో ఆటోమోటివ్‌ సర్వీస్‌ కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: వాణిజ్య వాహనాలతోపాటు, వ్యక్తిగత వాహనాలకు సర్వీస్‌ సేవలను అందించే ఆటోమోటివ్‌ మాన్యుఫాక్చరర్స్‌ లిమిటెడ్‌ (ఏఎంపీఎల్‌) ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటలో అత్యాధునిక సర్వీసు కేంద్రాన్ని ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 104 సర్వీస్‌ టచ్‌పాయింట్లతో విస్తరించిన ఏఎంపీఎల్‌.. అశోక్‌ లేల్యాండ్‌కు సంబంధించిన అతి పెద్ద డీలర్లలో ఒకటి. 716 జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ కేంద్రం తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య తిరిగే అన్ని రకాల అశోక్‌ లేల్యాండ్‌ వాహనాలకు అవసరమైన సేవలను అందించనుంది. ఈ సందర్భంగా ఏఎంపీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సంఘ్వీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇది అతిపెద్ద సర్వీస్‌ కేంద్రమని పేర్కొన్నారు. 24×7 బ్రేక్‌డౌన్‌ అసిస్టెన్స్‌లాంటి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.


భూములను విక్రయించిన ఇండియా సిమెంట్స్‌

హైదరాబాద్‌: నగదు సమీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లాలో ఉన్న 73.75 ఎకరాల భూమిని ఇండియా సిమెంట్స్‌ విక్రయించింది. దీన్ని రూ.70 కోట్లకు అమ్మేందుకు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మూలధన అవసరాల కోసం ఇండియా సిమెంట్స్‌ కొన్ని నిరుపయోగ ఆస్తులను విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.


మహీంద్రా ఇన్సూరెన్స్‌లో మహీంద్రా ఫైనాన్స్‌కు 20% వాటా

దిల్లీ: మహీంద్రా ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ లిమిటెడ్‌ (ఎంఐబీఎల్‌)లో 20 శాతం వాటాను రూ.206.39 కోట్లకు కొనుగోలు చేసినట్లు మహీంద్రా ఫైనాన్స్‌ శుక్రవారం వెల్లడించింది. దీంతో మహీంద్రా ఫైనాన్స్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఎంఐబీఎల్‌ మారింది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో ఎంఐబీఎల్‌ షేరును రూ.1,000 చొప్పున మొత్తం 20,61,856 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశామని, ఇందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చిందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో మహీంద్రా ఫైనాన్స్‌ తెలిపింది. దీంతో సెప్టెంబరు 22 నుంచి ఎంఐబీఎల్‌ అనుబంధ సంస్థగా మారిందని పేర్కొంది.


రూ.1500 కోట్ల సమీకరణలో కర్ణాటక బ్యాంక్‌

దిల్లీ: వ్యాపార వృద్ధి కోసం ఒకటి లేదా ఎక్కువ విడతల్లో షేర్ల విక్రయం ద్వారా రూ.1500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతి ఇచ్చినట్లు కర్ణాటక బ్యాంక్‌ శుక్రవారం వెల్లడించింది. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ లేదా రైట్స్‌ ఇష్యూ లేదా క్యూఐపీ లేదా ఇతర అనుమతించిన పద్ధతుల్లో నిధుల సమీకరణకు బోర్డు అనుమతి ఇచ్చినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌, భారతీ యాక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు 3,34,00,132 షేర్లను జారీ చేసేందుకు కూడా బోర్డు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఒక్కో షేరు రూ.239.52 చొప్పున వీటి విలువ రూ.800 కోట్ల వరకు ఉంటుంది.  


అజియో ‘ఆల్‌ స్టార్స్‌ సేల్‌’ వచ్చేసింది

హైదరాబాద్‌: ఖరీదైన ఫ్యాషన్‌ ఉత్పత్తుల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ అజియో ‘ఆల్‌ స్టార్స్‌ సేల్‌’ పేరుతో విక్రయాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో వినియోగదార్లు 5500కు పైగా బ్రాండ్లకు చెందిన   1.5 మిలియన్‌ ఫ్యాషన్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని అజియో ఒక ప్రకటనలో తెలిపింది. సరికొత్త సంప్రదాయ ఉత్పత్తుల బ్రాండు ‘రి-వాహ్‌’ను కూడా ఇదే వేదికగా ప్రారంభించినట్లు, ఈ బ్రాండు కింద 2,000కు పైగా ఉత్పత్తులు లభ్యమవుతాయని పేర్కొంది. వివిధ బ్రాండ్లు, విభాగాల్లో వినియోగదారుల జరిపే కొనుగోళ్లపై 50-90 శాతం వరకు డిస్కౌంటును పొందొచ్చని పేర్కొంది. ఐసీఐసీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే మరో 10 శాతం అదనంగా తగ్గింపు లభిస్తుందని వెల్లడించింది. ఉత్తమ కొనుగోలుదార్లు ప్రతి ఆరు గంటలకు ఐఫోన్‌ 14 ప్రో మాక్స్‌, యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం2, రూ.1 లక్ష విలువైన పసిడిని గెలుచుకోవచ్చు.  


ఎన్‌సీసీకి కొత్త ఆర్డర్లు

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ రంగంలోని ఎన్‌సీసీకి కొత్త ఆర్డర్లు లభించాయి. ముంబయిలో 2 సొరంగ మార్గాల నిర్మాణం నిమిత్తం లభించిన ఈ ఆర్డర్లను పూర్తి చేసేందుకు జె.కుమార్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌(జేకేఐఎల్‌)తో కలిసి ఒక ఉమ్మడి భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసినట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.6,301.08 కోట్ల ఆర్డర్లు లభించాయి. ఉమ్మడి సంస్థలో ఎన్‌సీసీకి 51%, జేకేఐఎల్‌కు 49% వాటా ఉండనుంది. గోరేగావ్‌ ఫిల్మ్‌సిటీ నుంచి ఖిండీపడ (అమర్‌నగర్‌) వరకూ రెండు సొరంగ మార్గాలను డిజైన్‌, నిర్మాణం, నిర్వహణ కోసం ఈ ఆర్డరు లభించింది. ఈ ప్రాజెక్టులో ఎన్‌సీసీ  రూ.3,213.55 కోట్ల విలువైన పనులను నిర్వహిస్తుంది. ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 10 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని