కెనడాలో ‘మహీంద్రా’ అనుబంధ సంస్థ మూత

మహీంద్రా గ్రూప్‌నకు కెనడాలో అనుబంధంగా పనిచేస్తున్న ‘రెస్సన్‌ ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌’ తమ కార్యకలాపాలను మూసివేసింది.

Published : 23 Sep 2023 01:38 IST

దిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు కెనడాలో అనుబంధంగా పనిచేస్తున్న ‘రెస్సన్‌ ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌’ తమ కార్యకలాపాలను మూసివేసింది. ఈ విషయాన్ని మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం అండ్‌ ఎం) గురువారం ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఎం అండ్‌ ఎంకు రెస్సన్‌లో 11.18 శాతం వాటా ఉంది. రెస్సన్‌ ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌ స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేసే నిమిత్తం కెనడా కార్పొరేషన్స్‌కు దరఖాస్తు చేసుకోగా.. సెప్టెంబర్‌ 20న ఆమోదం లభించింది. దీంతో కంపెనీ మూతపడింది. ఫలితంగా ఆ సంస్థతో తమ అనుబంధం కూడా ముగిసినట్లు ఎం అండ్‌ ఎం తెలిపింది. మూసివేతకు కారణాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. కానీ, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది.

రెస్సన్‌ మూసివేత వల్ల ఎంఅండ్‌ఎంకు 4.7 మిలియన్‌ కెనడా డాలర్లు (దాదాపు రూ.28.7 కోట్లు) లభించనున్నాయి. ‘క్లాస్‌ సి ప్రిఫర్డ్‌ షేర్ల’ కింద ఈ మొత్తం తమకు అందనున్నట్లు ఎంఅండ్‌ఎం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని