హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల విక్రయాలతో..

మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ, కమొడిటీ షేర్లు నీరసపడ్డాయి.

Published : 23 Sep 2023 01:46 IST

నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు
సమీక్ష

దుపర్ల అమ్మకాలు కొనసాగడంతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ, కమొడిటీ షేర్లు నీరసపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు కుదేలవ్వడం, విదేశీ అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు పెరిగి 82.94 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.59% లాభపడి 93.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ ఉదయం 66,215.04 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆరంభంలో తడబడినప్పటికీ.. పుంజుకుని 215 పాయింట్ల లాభంతో 66,445.47 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్టాల్లోకి జారుకుని 65,952.83 పాయింట్లకు చేరింది. చివరకు 221.09 పాయింట్ల నష్టపోయి 66,009.15 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 68.10 పాయింట్లు తగ్గి 19,674.25 దగ్గర స్థిరపడింది.

  • అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్సెస్‌ను రూ.5,651.5 కోట్లకు నిర్మాకు విక్రయించనున్నట్లు ప్రకటించడంతో గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరు 3.12% కోల్పోయి రూ.802.25 దగ్గర ముగిసింది.
  • ఇటలీ సంస్థ మెనారిని నుంచి 5 ఔషధ బ్రాండ్‌లను రూ.101 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు లుపిన్‌ తెలిపింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 నష్టపోయాయి. విప్రో 2.32%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.57%, అల్ట్రాటెక్‌ 1.50%, పవర్‌గ్రిడ్‌ 1.34%, సన్‌ఫార్మా 1.26%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.94%, ఐటీసీ 0.94%, టాటా మోటార్స్‌ 0.93%, టైటన్‌ 0.89% చొప్పున కుదేలయ్యాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.92%, మారుతీ 2.34%, ఎస్‌బీఐ 1.67%, ఎం అండ్‌ ఎం 1.52%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌      1.11% లాభపడ్డాయి.  
  • ఇంజినీరింగ్‌, సాంకేతిక పరిష్కారాలను అందించే హైదరాబాద్‌ సంస్థ సైయెంట్‌ తన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లోకి నితిన్‌ ప్రసాద్‌ను తీసుకుంది. ప్రస్తుతం ఆయన షెల్‌ కంపెనీస్‌ ఇండియా ఛైర్మన్‌గా ఉన్నారు.
  • విదేశీ సంస్థలు, ప్రైవేట్‌ కంపెనీలను ఆకర్షించేందుకు అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు అంతర్‌ మంత్రిత్వ శాఖల చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రంగంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితోనే శాటిలైట్‌ ఏర్పాటు, కార్యకలాపాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నారు.

స్టాప్‌లాస్‌ మార్కెట్‌ ఆర్డర్లను నిలిపివేయనున్న బీఎస్‌ఈ: అక్టోబరు 9 నుంచి స్టాప్‌ లాస్‌ మార్కెట్‌ (ఎస్‌ఎల్‌-ఎం) ఆర్డర్లును నిలిపివేయాలని బీఎస్‌ఈ నిర్ణయించింది. మాన్యువల్‌, ఆల్గో ట్రేడ్‌ల నుంచి వస్తున్న అసాధారణ ఆర్డర్లును నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల ప్రారంభంలో ఎస్‌ఎల్‌-ఎం ఆర్డర్‌ కారణంగా జరిగిన అసాధారణ ట్రేడ్‌ ఘటన వల్ల ట్రేడింగ్‌ వర్గాల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. షేరు ట్రిగ్గర్‌ ధరకు చేరుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మార్కెట్‌ ధర వద్ద కొనుగోలు, అమ్మకం జరిగే ఆర్డరును ఎస్‌ఎల్‌-ఎంగా పరిగణిస్తారు. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్‌, కరెన్సీ డెరివేటివ్స్‌, కమొడిటీ డెరివేటివ్స్‌ విభాగాల్లో ఎస్‌ఎల్‌-ఎం ఆర్డరును నిలిపివేస్తున్నట్లు బీఎస్‌ఈ తెలిపింది. ఇటువంటి ఆర్డర్లను 2021 సెప్టెంబరులోనే ఎన్‌ఎస్‌ఈ నిలిపివేసింది.

ఐపీఓ సమాచారం..

  • జాగిల్‌ ప్రీపెయిడ్‌ షేర్ల అరంగేట్రం స్తబ్దుగా సాగింది. ఇష్యూ ధర రూ.164తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు 1.21% నష్టంతో రూ.162 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.176 వద్ద గరిష్ఠాన్ని, రూ.155.60 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 3.47% నష్టపోయి రూ.158.30 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,932.79 కోట్లుగా నమోదైంది.
  • సంహీ హోటల్స్‌ షేరు ఇష్యూ ధర రూ.126తో పోలిస్తే బీఎస్‌ఈలో 3.61% లాభంతో రూ.130.55 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16.23% దూసుకెళ్లి రూ.146.45 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 13.92% పెరిగి రూ.143.55 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3,129.90 కోట్లుగా నమోదైంది.
  • వాలియంట్‌ లేబొరేటరీస్‌ ఐపీఓ ఈ నెల 27న ప్రారంభమై అక్టోబరు 3న ముగియనుంది. ఐపీఓలో భాగంగా 1.08 కోట్ల తాజా షేర్లను కంపెనీ విక్రయించనుంది. సెప్టెంబరు 26న యాంకర్‌ మదుపర్లు బిడ్‌లు దాఖలు చేయొచ్చు. ఐపీఓ ఎటువంటి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ లేదు.
  • మనోజ్‌ వైభవ్‌ జెమ్స్‌ ఎన్‌ జువెలర్స్‌ ఐపీఓ మొదటి రోజున 13% స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 91,20,664 షేర్లు జారీ చేయగా, 12,22,128 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
  • సిగ్నేచర్‌ గ్లోబల్‌ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 11.88 రెట్ల స్పందన నమోదైంది. ఇష్యూలో భాగంగా 1,12,43,196 షేర్లు ఆఫర్‌ చేయగా, 13,36,05,074 షేర్లకు బిడ్లు వచ్చాయి. ఎన్‌ఐఐ విభాగంలో 13.54 రెట్లు, క్యూఐబీ విభాగంలో 12,71 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 6.82 రెట్ల స్పందన లభించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు