ఫోన్‌పే కొత్త యాప్‌ స్టోర్‌

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. గూగుల్‌ ప్లేస్టోర్‌కు పోటీగా కొత్త యాప్‌ స్టోర్‌ను తీసుకొస్తోంది.

Updated : 24 Sep 2023 12:52 IST

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. గూగుల్‌ ప్లేస్టోర్‌కు పోటీగా కొత్త యాప్‌ స్టోర్‌ను తీసుకొస్తోంది. ఇండస్‌ యాప్‌ స్టోర్‌ పేరిట దీన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్టోర్‌లో తమ అప్లికేషన్లను (యాప్‌లు) నమోదు చేసుకోవాలని డెవలపర్లను కోరింది. 12 స్థానిక భాషల్లో ఈ యాప్‌ స్టోర్‌ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం యాప్‌ స్టోర్లలో గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్‌ల గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఫోన్‌పే వాటికి సవాలు విసిరేందుకు సిద్ధమైంది. ఇండస్‌యాప్‌ స్టోర్‌లో ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలపర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. www.indusappstore.com  వెబ్‌సైట్‌ ద్వారా యాప్స్‌ను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. తొలి ఏడాది డెవలపర్ల నుంచి తాము ఎలాంటి ఫీజులు వసూలు చేయమని తెలిపింది. మరుసటి ఏడాది నుంచి కూడా స్వల్ప మొత్తంలోనే ఫీజు తీసుకుంటామని పేర్కొంది. యాప్‌ డెవలపర్ల నుంచి ఎలాంటి ప్లాట్‌ఫామ్‌ ఫీజుగానీ, ఇన్‌-యాప్‌ పేమెంట్స్‌కు కమీషన్‌ గానీ వసూలు చేయమని స్పష్టం చేసింది. అలాగే తమకు నచ్చిన పేమెంట్‌ గేట్‌వేను ఉచితంగా ఇంట్రిగేట్‌ చేసుకోవచ్చని తెలిపింది. ‘సాధారణంగా ఇన్‌ యాప్‌ పర్చేజీలపై గూగుల్‌, యాపిల్‌ స్టోర్లు 30 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నాయి. అలాగే తమకు నచ్చిన పేమెంట్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ను ఎంచుకోకుండా డెవలపర్లను నియంత్రిస్తున్నాయి. దీంతో వీటిపై యాప్‌ డెవలపర్లు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు తమ ఇండస్‌ యాప్‌స్టోర్‌ ప్రత్యామ్నాయం కాగలద’ని ఫోన్‌పే చీఫ్‌ ప్రోడక్ట్‌ ఆఫీసర్‌, ఇండస్‌ యాప్‌స్టోర్‌ సహ వ్యవస్థాపకుడు ఆకాశ్‌ డోంగ్రే తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని