దేశంలో రెండు భారీ సెమీకండక్టర్‌ ప్లాంట్‌లు!

దేశంలో రెండు భారీ సెమీకండక్టర్‌ ప్లాంట్‌లు రాబోతున్నాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ శనివారం పేర్కొన్నారు.

Updated : 24 Sep 2023 06:49 IST

పరిశీలనలో ప్రతిపాదనలు
కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌

సనంద్‌: దేశంలో రెండు భారీ సెమీకండక్టర్‌ ప్లాంట్‌లు రాబోతున్నాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ శనివారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, వచ్చే కొన్ని నెలల్లో కొలిక్కిరానున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ అగ్రగామిగా ఎదిగే అవకాశం ఉన్న ప్రత్యేక ప్రాంతాలపై ఈ ప్రాజెక్టులు దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనల పూర్తి వివరాలను వెల్లడించలేదు. మైక్రాన్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. సెమీకండక్టర్‌ విభాగంలో భారత్‌ పురోగతిని అంతర్జాతీయ కంపెనీలు చూస్తున్నాయని.. భారీ, సంక్షిష్ట విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థులని అన్నారు. ‘అంతర్జాతీయ సెమీకండక్టర్‌ కంపెనీలు ప్రస్తుతం భారత్‌ వైపు నమ్మకంగా చూస్తున్నాయి. రాబోయే నెలల్లో మరో రెండు భారీ సెమీకండక్టర్‌ ప్లాంట్‌లు వచ్చే అవకాశం ఉంది’ అని వైష్ణవ్‌ తెలిపారు. సెమీకండక్టర్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ద్వారా భారత్‌ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరనుందన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభమైన మైక్రాన్‌ ప్లాంట్‌, 2024 డిసెంబరు నుంచి చిప్‌ ఉత్పత్తి ప్రారంభించనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లుగా ఉన్న సెమీకండక్టర్‌ గిరాకీ.. వచ్చే కొన్నేళ్లలో రూ.5 లక్షల కోట్లకు చేరొచ్చని వైష్ణవ్‌ అంచనా వేశారు. మైక్రాన్‌కు చెందిన అయిదు సరఫరా సంస్థలు ప్లాంట్‌ ఏర్పాటుకు చూస్తున్నట్లు సమాచారం. ఇందులో సిమ్‌టెక్‌ సంస్థ కూడా ఉంది.

టాటా ప్రాజెక్ట్స్‌ చేతికి నిర్మాణ పనులు: గుజరాత్‌లోని సనంద్‌లో అడ్వాన్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులను చేపట్టడానికి మైక్రాన్‌ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టాటా ప్రాజెక్ట్స్‌ వెల్లడించింది. సనంద్‌ దగ్గర చారోడీలోని గుజరాత్‌ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్‌ స్థలంలో ఈ ప్లాంట్‌ నిర్మించనున్నారు. మొత్తం 93 ఎకరాల్లో ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. మొదటిదశలో 5,00,000 చదరపు అడుగుల క్లీన్‌రూమ్‌ స్థలాన్ని నిర్మించనున్నామని.. 2024 చివర్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి చూస్తున్నట్లు కంపెనీ వివరించింది.

గుజరాత్‌లో 2.75 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.22,540 కోట్లు) పెట్టుబడులతో సెమీకండక్టర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు దిగ్గజ చిప్‌ తయారీ సంస్థ మైక్రాన్‌ ఈ ఏడాది జూన్‌లో ప్రకటించింది. రెండు దశల్లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు మైక్రాన్‌ 825 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. మిగిలిన మొత్తం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని