పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!

ఈ పండగ సీజనులో కొనుగోళ్ల జోరు కనిపించే అవకాశం ఉందని డెలాయిట్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

Published : 24 Sep 2023 04:44 IST

ఖరీదైన, విలాసవంత ఉత్పత్తులపై అధికంగా వెచ్చించే అవకాశం
డెలాయిట్‌  సర్వేలో వెల్లడి

దిల్లీ: ఈ పండగ సీజనులో కొనుగోళ్ల జోరు కనిపించే అవకాశం ఉందని డెలాయిట్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా విలాసవంత, ఖరీదైన ఉత్పత్తులపై భారతీయ వినియోగదార్లు అధికంగా వెచ్చించే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. సమీప భవిష్యత్‌లో అనుకోకుండా ఎదురయ్యే ఖర్చులను సమర్థంగా తట్టుకొనగలిగే స్థితిలో ఉన్నామని సర్వేలో సుమారు సగం మంది వెల్లడించడం గమనార్హం. ‘పండగ సీజను సమీపిస్తుండటంతో.. భారతీయ వినియోగదారు విశ్వాసం పెరుగుతోంది. పండగల సంబంధిత ఉత్పత్తులపై వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని 56 శాతం మంది తెలిపినట్లు’ డెలాయిట్‌ నివేదిక తెలిపింది. స్వల్పకాలంలో వినియోగదార్ల వెచ్చింపు పెరుగుతాయని.. ముఖ్యంగా దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ, వినోదం, విలాసవంత ఉత్పత్తులపై అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉందని తెలిపింది. పండగ సీజనులో ఈ వ్యయాలు మరింతగా పెరుగుతాయని వివరించింది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంత వృద్ధిని నమోదు చేస్తుండటం.. ఖరీదైన, విలాసవంత ఉత్పత్తులపై వెచ్చించేలా వినియోగదార్లకు ప్రోత్సాహక వాతావరణాన్ని సృష్టించిందని డెలాయిట్‌ ఆసియా పసిఫిక్‌ పార్ట్‌నర్‌ రాజీవ్‌ సింగ్‌ తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి విపణుల్లోనూ వినియోగపరంంగా బలమైన వృద్ధి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిణామం రిటైల్‌, వాహన, పర్యాటకం, ఆతిథ్య రంగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతోందని అన్నారు. విలాసవంత వస్తువుల కొనుగోలుకే కాదు.. దేశ విదేశాల్లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. దేశీయ, అంతర్జాతీయ విమాన బుకింగ్‌లు పెరగడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని