బీమా రంగం వృద్ధికి అపార అవకాశాలు

‘దేశంలో బీమా రంగం వృద్ధికి అపార అవకాశాలున్నాయి. కొవిడ్‌ అనంతరం బీమా పాలసీలపై అవగాహన పెరిగింది.

Published : 24 Sep 2023 02:17 IST

ఈనాడు ఇంటర్వ్యూ
కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ అనుజ్‌ మాథుర్‌
ఈనాడు - హైదరాబాద్‌

‘దేశంలో బీమా రంగం వృద్ధికి అపార అవకాశాలున్నాయి. కొవిడ్‌ అనంతరం బీమా పాలసీలపై అవగాహన పెరిగింది. చిన్న వయసులోనే బీమా అవసరాన్ని గుర్తిస్తున్నారు. ఇది సానుకూల పరిణామం. గ్రామీణ ప్రాంతాలకూ బీమా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిజిటలీకరణలో పెరిగిన వేగం ఇందుకు తోడ్పడుతుంది’ అని కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనుజ్‌ మాథుర్‌ అన్నారు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియాలు మన దేశంలో ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయని ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో వివరించారు.

జీవిత బీమా రంగంలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు వస్తున్నాయి? పాలసీదారుల వైఖరి ఎలా ఉంది

భారతదేశంలో జీవిత బీమా మార్కెట్‌ భారీ మార్పులకు లోనవుతోంది. బీమా సంస్థలకూ, పాలసీదారులకూ ఇది సరికొత్త అవకాశాలను అందిస్తోంది. దేశంలో కేవలం 3.2 శాతం జనాభాకే బీమా పాలసీలున్నాయి. దీన్ని బట్టి, బీమా పరిశ్రమ వృద్ధిని అంచనా వేసుకోవచ్చు. బీమా కంపెనీలు కొత్త ఉత్పత్తులు, వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లుగా పాలసీలను తీసుకొస్తూ పాలసీలదారులకు దగ్గరవుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ అనంతరం బీమాపై అవగాహన పెరిగింది. పాలసీదారులు సానుకూల దృష్టితో చూడటం ప్రారంభించారు. బీమాను ఒక తప్పనిసరి అవసరంగా చూస్తున్నారు. డిజిటలీకరణ పెరగడం బీమా పరిశ్రమకు ఎంతో మేలు చేస్తోంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బీమా పూర్తి స్థాయిలో విస్తరించలేదు. ఇక్కడ పాలసీలు పెరిగితే.. బీమా రంగానికి ఎంతో సానుకూలమైన అంశంగా మారుతుంది.

కొవిడ్‌-19 తర్వాత జీవిత బీమా ఎలా ప్రభావితం అవుతోంది

పాలసీదారులకు ఆర్థిక భద్రత ప్రాముఖ్యాన్ని గ్రహించేలా మహమ్మారి చేసింది. దీనిపై మరింత అవగాహన పెంచుకుంటున్నారు. పూర్తి రక్షణ, పొదుపు ఆధారిత బీమా ఉత్పత్తులను ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జీవిత బీమా పాలసీలంటే పన్ను మినహాయింపు, పొదుపు అవసరాలకు మాత్రమే కాదని గుర్తిస్తున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, పొదుపు ఉత్పత్తులను పరిశీలిస్తున్నారు. మన దేశంలో టర్మ్‌ పాలసీల ప్రీమియం ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. వారు చెల్లించే ప్రీమియంతో కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుందన్న విషయంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.  

2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం సాధ్యమవుతుందా? దీనికి బీమా పరిశ్రమ ఎలా సిద్ధం అవుతోంది

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) 2047 నాటికి అందరికీ బీమా పాలసీలు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా బీమా పాలసీలపై విస్తృతమైన ప్రచారం నిర్వహించడం అవసరం. బీమా సంస్థలు దీనిపై పూర్తిగా దృష్టి సారిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీమా అక్షరాస్యతను పెంచేందుకు మా సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ స్థాయిలో బీమా పాలసీల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. స్థానిక పంపిణీ వ్యవస్థలతో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడం, సాంకేతికతను ఉపయోగించుకోవడంతోపాటు పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించాల్సిన అవసరం ఉంది.  

పాలసీదారులకు మెరుగైన పాలసీలు, సేవలను అందించేందుకు మీరేం చేస్తున్నారు

ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మేము మా పాలసీలను తీసుకొస్తున్నాం. ఇందుకోసం మా డిజిటల్‌ సేవలను మెరుగుపర్చుకునేందుకు పెట్టుబడులు పెడుతున్నాం. కేవలం పాలసీలను నిర్వహించేందుకే కాకుండా.. ఇతర సేవలనూ మా యాప్‌ ద్వారా అందిస్తున్నాం. ఇందులో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలనూ జోడించాం.   కెనరా బ్యాంకుకున్న 10  వేలకు పైగా శాఖలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా మా బీమా ఉత్పత్తులను అందిస్తున్నాం.

ఏ రకం బీమా ఉత్పత్తులకు ఆదరణ అధికంగా ఉంటోంది

వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ, యూనిట్‌ ఆధారిత, పూర్తి రక్షణ, యాన్యుటీ పాలసీల్లో ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పాలసీలను ఎంచుకోవాలి. ఆరోగ్య పరీక్షల అవసరం లేకుండా తక్కువ విలువైన పాలసీలను విక్రయించేందుకు మా సంస్థ దృష్టి పెడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని