ఔషధ ఎగువతులపైౖ ప్రభావం ఉంటుందా?

ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల అంశం మనదేశానికి, కెనడా మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమవుతోంది.

Published : 24 Sep 2023 02:17 IST

కెనడాతో దౌత్యపరమైన విభేదాలు
పరిశ్రమ వర్గాల్లో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల అంశం మనదేశానికి, కెనడా మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమవుతోంది. ఇటీవలి కాలంలో ఈ వివాదం పెద్దది కావటం, ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించడం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావటానికి ఎంతో సమయం పడుతుందని స్పష్టమవుతుంది. ఈ వ్యవహారం ద్వైపాక్షిక వాణిజ్యం మీదా ప్రభావం చూపుతుందేమోననే అనుమానాలు స్థానిక వ్యాపార వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 8 బిలియన్‌ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యం నమోదవుతోంది. మనదేశం ఏటా 4 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన వివిధ రకాలైన వస్తువులు ఎగుమతి చేస్తోంది. ఇందులో మందులు, ప్లాస్టిక్‌ వస్తువులు, చేపలు- రొయ్యలు, స్మార్ట్‌ఫోన్లు, ఆభరణాలు, బాస్మతి బియ్యం, దుస్తులు ఉంటున్నాయి. హైదరాబాద్‌లో అధికంగా ఉన్న ఫార్మా కంపెనీలు కెనడాలోని వినియోగదార్లకు పెద్దఎత్తున మందులు ఎగుమతి చేస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా తదితర ఫార్మా కంపెనీలు తమ ఔషధాలను కెనడాలో విక్రయిస్తున్నాయి.

2 శాతం మాత్రమే...

గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 500 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన మందులు కెనడాకు ఎగుమతి కావటం గమనార్హం. అందువల్ల కెనడాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఇరు దేశాల మధ్య సంబంధాలు, సంబంధిత ఇతర అంశాలను స్థానిక ఫార్మా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మందుల ఎగుమతులపై ఏమైనా ప్రభావం పడుతుందా, ఎగుమతులకు ఇబ్బందులు ఎదురవుతాయా... అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కానీ అటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని మరికొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మనదేశం నుంచి నమోదయ్యే మందుల ఎగుమతుల్లో కెనడా వాటా కేవలం 2 శాతం మాత్రమే. అందువల్ల ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- అని స్థానిక ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మనదేశం నుంచి దాదాపు 24 బిలియన్‌ డాలర్ల విలువైన మందులు ఎగుమతి అయ్యాయి. ఇందులో అత్యధికంగా...,  దాదాపు 35 శాతం వరకూ అమెరికాకే మందులు ఎగుమతి అయ్యాయి. ఇంకా ఐరోపా, ఆఫ్రికా దేశాలతో పాటు బ్రెజిల్‌, రష్యా దేశాలకు మన దేశం నుంచి మందులు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. అందువల్ల కెనడాతో మనదేశానికి సంబంధాలు దెబ్బతినటం వల్ల మందుల ఎగుమతులపై ప్రభావం పెద్దగా ఉండదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. నష్టమూ తక్కువేని చెబుతున్నాయి. అదే సమయంలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు, వివాదం దీర్ఘకాలం పాటు కొనసాగితే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని