రిలయన్స్‌ ‘హోల్డింగ్‌ కంపెనీ’గా మారొచ్చు!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మున్ముందు హోల్డింగ్‌ కంపెనీగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని ఫిచ్‌ గ్రూపులో భాగమైన క్రెడిట్‌ సైట్స్‌ పేర్కొంది.

Published : 26 Sep 2023 02:07 IST

ప్రధాన వ్యాపారాల నిర్వహణ సంస్థల్లో మెజార్టీ వాటాలు దాని చేతిలోనే
ముకేశ్‌ పిల్లల మధ్య వైరుధ్యాలు రాకుండా స్పష్టమైన వ్యాపార విభజన అవసరం
రిలయన్స్‌లో వారసత్వ ప్రణాళికపై క్రెడిట్‌ సైట్స్‌ నివేదిక వెల్లడి

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మున్ముందు హోల్డింగ్‌ కంపెనీగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని ఫిచ్‌ గ్రూపులో భాగమైన క్రెడిట్‌ సైట్స్‌ పేర్కొంది. బలమైన రుణ ప్రొఫైల్‌తో పాటు టెలికాం, రిటైల్‌ విభాగాలు మంచి ఆదాయాలు నమోదుచేయొచ్చన్న అంచనాలు.. అధిక ముడి చమురు ధరల వల్ల చమురు వ్యాపారం బలహీన పనితీరును కనబరచే అవకాశం ఉండటం, మూలధన అవసరాలు పెరగడం లాంటి వాటి వల్ల కలిగే ప్రతికూలతల ప్రభావాన్ని తగ్గిస్తాయని రిలయన్స్‌ వారసత్వ ప్రణాళికపై రూపొందించిన నివేదికలో క్రెడిట్‌ సైట్స్‌ అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల రిలయన్స్‌ గ్రూపులో వారసత్వ ప్రణాళికను ముకేశ్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సంస్థ బోర్డులో తన ముగ్గురు పిల్లలు- ఆకాశ్‌, ఈశా, అనంత్‌ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపడతారని ముకేశ్‌ తెలిపారు. తాను మాత్రం మరో ఐదేళ్లు రిలయన్స్‌ ఛైర్మన్‌, సీఈఓగా కొనసాగుతానని వెల్లడించారు.

కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం పడకుండా..: ‘కీలకమైన వ్యక్తికి సంబంధించిన అంశంపైనా చాలా మంది మదుపర్ల దృష్టి ఉంటుంది. ముకేశ్‌ ముగ్గురు పిల్లలకు ప్రధాన వ్యాపార విభాగాల్లో (టెలికాం, రిటైల్‌, కొత్త ఇంధనం) నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. భవిష్యత్‌లో ముగ్గురి మధ్య ఎలాంటి వివాదాలు రాకూడదంటే స్పష్టమైన వ్యాపార విభజన అవసరమన్నది మా భావన’ అని క్రెడిట్‌సైట్స్‌ విశ్లేషించింది. వారసత్వ ప్రణాళిక... అంబానీ అనూహ్యంగా లేదంటే అనుకోని పరిస్థితిలో గ్రూపు నుంచి వైదొలిగేందుకు దారి తీయకూడదని, దీని వల్ల కంపెనీ పనితీరు, కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని తెలిపింది. బదులుగా ఆయన కొత్త తరానికి మార్గదర్శకంగా.. వాళ్లను ఉత్తమ సారథులుగా తీర్చిదిద్దేలా ఈ ప్రణాళిక ఉపయోగపడాలని పేర్కొంది.

ట్రస్టు ద్వారా నిర్వహణకు అవకాశం: ‘ప్రధాన వ్యాపార విభాగాలను నిర్వహించే స్వతంత్ర సంస్థల్లో మెజార్టీ వాటాలతో హోల్డింగ్‌ కంపెనీగా ఆర్‌ఐఎల్‌ రూపాంతరం చెందుతుందని తాము భావిస్తున్నామ’ని క్రెడిట్‌సైట్స్‌ తెలిపింది. అంబానీ చేతిలో నుంచి ముగ్గురు పిల్లలకు సంస్థ బాధ్యతలు వెళ్లిన తర్వాత కూడా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కుటుంబ నేతృత్వంలోని కంపెనీగానే కొనసాగుతుందనే తాము అనుకుంటున్నట్లు వివరించింది. అయితే అంబానీ, ఆయన ముగ్గురు పిల్లలు, కుటుంబ సభ్యుల నియంత్రణలో ఒక ట్రస్టు ఏర్పాటుకు అవకాశమైతే ఉండొచ్చని తెలిపింది. ‘గత రెండు వార్షిక సాధారణ సమావేశాలను(ఏజీఎంలు) గమనిస్తే.. తన ముగ్గురు పిల్లలు వాళ్లకు అప్పగించిన వ్యాపార విభాగంలో ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకొని, దీర్ఘకాలం పాటు రాణించాలన్నది అంబానీ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే వాళ్లకు కేటాయించిన వ్యాపారం ద్వారా భవిష్యత్‌లో తన పిల్లలు ఎలాంటి హోదా/బాధ్యతను నిర్వహించాలనే దానిపైనా ఆయనకు పూర్తి స్పష్టత ఉందని మేం భావిస్తున్నామ’ని క్రెడిట్‌ సైట్స్‌ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని