ఆద్యంతం ఒడుదొడుకులు

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ స్వల్పంగా పెరిగాయి.

Published : 26 Sep 2023 02:07 IST

సమీక్ష

ద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ స్వల్పంగా పెరిగాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ అమ్మకాలు మాత్రం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 20 పైసలు కోల్పోయి 83.14 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.39% పెరిగి 93.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 66,082.99 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో తడబడిన సూచీ, 65,764.03 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ పుంజుకుని 66,225.63 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 14.54 పాయింట్ల లాభంతో 66,023.69 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎటువంటి మార్పులేకుండా 19,674.55 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 19,601.55- 19,734.15 పాయింట్ల మధ్య కదలాడింది.

 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.64%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.23%, కోటక్‌ బ్యాంక్‌ 1.60%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.44%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 0.72%, ఎన్‌టీపీసీ 0.69% రాణించాయి. ఇన్ఫోసిస్‌, ఎం అండ్‌ ఎం, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌  1.42% వరకు నష్టపోయాయి.  రంగాల వారీ సూచీల్లో పరిశ్రమలు, ఐటీ, టెలికాం, వాహన, యంత్ర పరికరాలు, టెక్‌ డీలాపడ్డాయి.
 • రెలిగేర్‌లో 26% వాటాకు రూ.2,116 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌: కంపెనీలో 26 శాతం వరకు వాటాను కొనుగోలు చేసేందుకు రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వాటాదార్లకు రూ.2,116 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌ను డాబర్‌ ఇండియా ప్రమోటర్‌ సంస్థ బర్మన్‌ కుటుంబం ప్రకటించింది. ఈ ఆఫర్‌ తర్వాత బర్మన్‌ కుటుంబ వాటా 51 శాతానికి పెరిగి, కంపెనీ నియంత్రణ చేతిలోకి వస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు7.08% నష్టపోయి రూ.253.15 వద్ద ముగిసింది.
 • కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌, తయారీ సంస్థ (సీడీఎంఓ), సాఫ్ట్‌ జెలాటిన్‌ వ్యాపారాలను విడదీసి ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ వెల్లడించింది. స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌, స్టెరిసైన్స్‌ స్పెషాలిటీస్‌, స్టెలిస్‌ బయోఫార్మాల మధ్య ఈ సంస్థ ఏర్పాటు కానుంది. ఈ వార్తలతో స్ట్రైడ్స్‌ ఫార్మా షేరు 7.42% లాభంతో రూ.535.65 దగ్గర స్థిరపడింది.
 • అప్‌డేటర్‌ సర్వీసెస్‌ ఐపీఓ మొదటి రోజున 6% స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,19,99,999 షేర్లను జారీ చేయగా.. 6,94,650 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
 • బయోఇంధనాలపై 9 ప్రమాణాలను అభివృద్ధి చేసినట్లు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వెల్లడించింది. పారాఫినిక్‌ (గ్రీన్‌) డీజిల్‌ ప్రమాణాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నట్లు బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారీ అన్నారు.
 • 2030 గడువులోగా 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని భారత్‌ సాధిస్తుందని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రి ఆర్‌కే సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.
 • బ్యాంబూ హోటల్‌ గ్లోబల్‌ సెంటర్‌, గోవాన్‌ హోటల్స్‌ అండ్‌ రియాల్టీ, బీడీ అండ్‌ పీ హోటల్స్‌లో వాటాలను రూ.2,300 కోట్లకు కొనుగోలు చేసినట్లు డీబీ రియాల్టీ వెల్లడించింది. దీంతో కంపెనీ ఆతిథ్య సేవల వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలిపింది.

నిధుల సమీకరణ..

 • మొట్టమొదటి ఎన్‌సీడీల పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.2000 కోట్ల వరకు సమీకరించనున్నట్లు ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ తెలిపింది. ఈ ఇష్యూ సెప్టెంబరు 27న ప్రారంభమై అక్టోబరు 12న ముగియనుంది.
 • మూలధన వ్యయాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.2,250 కోట్ల వరకు సమీకరణ ప్రతిపాదనకు పవర్‌గ్రిడ్‌ బోర్డు ఆమోదం ఇచ్చింది.
 • ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ.5,600 కోట్ల రుణాలు సమీకరించినట్లు సెరెంటికా రెన్యూవబుల్స్‌ పేర్కొంది.
 • భారత రక్షణ శాఖకు యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్‌ అందించేందుకు జెన్‌ టెక్నాలజీస్‌కు కొత్త ఆర్డరు లభించింది. మొత్తం ఆర్డరు విలువ రూ.227.65 కోట్లు. ఇందులో జీఎస్‌టీ, ఏడేళ్ల పాటు నిర్వహణ కోసం రూ.43.22 కోట్లూ కలిసి ఉన్నాయని సంస్థ బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని