పట్టణ సహకార బ్యాంకుల్లో ఎన్‌పీఏలు పెరిగాయ్‌

పట్టణ సహకార బ్యాంకు(యూసీబీ)ల్లో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) నిష్పత్తి 8.7 శాతంగా ఉందని, ఇది ఆమోదయోగ్యం కాదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

Published : 26 Sep 2023 06:10 IST

ఇది ఆమోదయోగ్యం కాదు
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: పట్టణ సహకార బ్యాంకు(యూసీబీ)ల్లో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) నిష్పత్తి 8.7 శాతంగా ఉందని, ఇది ఆమోదయోగ్యం కాదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఎన్‌పీఏలు తగ్గేలా పాలన మెరుగుపరచుకోవాలని రుణదాతలకు సూచించారు. ఆర్‌బీఐ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో యూసీబీల డైరెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. యూసీబీ రంగంలో అనేక సవాళ్లు ఉన్న విషయాన్ని గుర్తించామని, ఇటీవలి కాలంలో ఆయా బ్యాంకులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ‘డిపాజిటర్ల నమ్మకంపై బ్యాంకులు నడుస్తాయి. మధ్య తరగతి, పేద వర్గాలు, పదవీ విరమణ పొందిన వారు కష్టపడి సంపాదించిన సొమ్మును కాపాడటాన్ని గుడికి లేదా గురుద్వారాకు వెళ్లడం కంటే చాలా పవిత్రంగా బ్యాంకులు భావించాల’ని యూసీబీల డైరెక్టర్లకు సలహా ఇచ్చారు. మొత్తం మీద చూస్తే పరిస్థితులు బాగానే ఉన్నా.. ఎన్‌పీఏలు, కనీస మూలధన నిష్పత్తి సంతృప్తికరంగా లేవని దాస్‌ ఆందోళన వెలిబుచ్చారు.షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల ఎన్‌పీఏలు 2023 మార్చి నాటికి దశాబ్ద ఉత్తమ స్థాయి అయిన 3.9 శాతానికి రాగా, మున్ముందు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌పీఏలను నిర్వహించడానికి క్రెడిట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలని సూచించారు. కనీస మూలధన నిష్పత్తి విషయంలో ఏడాది క్రితంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరం చివరకు 15.5 శాతం నుంచి 16.6 శాతానికి యూసీబీలు మెరుగయ్యాయని దాస్‌ తెలిపారు. బోర్డులో ఒకరిద్దరి ఆధిపత్యం మంచిది కాదు: పెద్ద వాణిజ్య బ్యాంకుల్లో సైతం బోర్డు సభ్యుల్లో ఒకరిద్దరు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు గుర్తించామని శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఈ తరహా పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. బోర్డులో జరిగే చర్చలు స్వేచ్ఛగా, న్యాయంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో యెస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ సమస్యలు ఎదుర్కొన్న ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

3 ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్‌బీఐ జరిమానా

నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ జరిమానా విధించింది. ‘రుణాలు, అడ్వాన్సులు-చట్టబద్ధ, ఇతర ఆంక్షలు’, ‘ఇంట్రా-గ్రూప్‌ లావాదేవీలు, ఎక్స్‌పోజర్‌ నిర్వహణపై మార్గదర్శకాలు’పై ఆర్‌బీఐ జారీ చేసిన పలు ఆదేశాలను పాటించనందుకు ఎస్‌బీఐపై రూ.1.3 కోట్ల జరిమానా విధించారు. రుణాలు, అడ్వాన్సులు-చట్టబద్ధ, ఇతర ఆంక్షలు, కేవైసీ, 2016 ఆర్‌బీఐ (డిపాజిట్లపై వడ్డీ రేట్లు) ఆదేశాల ఉల్లంఘనకు గాను ఇండియన్‌ బ్యాంక్‌ను రూ.1.62 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్‌బీఐ ఆదేశించింది. డిపాజిటర్‌ విద్య, అవగాహన నిధి పథకంలోని కొన్ని నిబంధనలు పాటించనందుకు పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌కు రూ.1 కోటి జరిమానా వేసింది. ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై రూ.8.80 లక్షల జరిమానా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని