సాయంత్రం 6 నుంచి 9 దాకా ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌

ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాలని ఎన్‌ఎస్‌ఈ భావిస్తోంది. ఇందులో భాగంగా దశల వారీగా, ఉత్పత్తుల వారీగా ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాలనుకుంటోంది.

Updated : 26 Sep 2023 07:12 IST

స్పందనను బట్టి రాత్రి 11:55 దాకా
ప్రణాళిక సిద్ధం చేస్తున్న ఎన్‌ఎస్‌ఈ
సెబీ అనుమతి కోసం ప్రతిపాదన

దిల్లీ: ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాలని ఎన్‌ఎస్‌ఈ భావిస్తోంది. ఇందులో భాగంగా దశల వారీగా, ఉత్పత్తుల వారీగా ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాలనుకుంటోంది. తొలుత ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌(ఎఫ్‌ అండ్‌ ఓ)లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రేడింగ్‌ సెషన్‌ నిర్వహించాలనుకుంటున్నట్లు ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ తెలిపారు. అనుమతి కోసం మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఎదుట ఈ ప్రతిపాదనను ఉంచినట్లు పేర్కొన్నారు. త్వరలోనే అనుమతి వస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఎక్స్ఛేంజీకి సెబీ నుంచి అనుమతి లభించగానే అందుకు తగ్గట్లు వ్యవస్థను సిద్ధం చేస్తామన్నారు. పొడిగించిన ట్రేడింగ్‌ సమయంలో మదుపర్ల నుంచి వచ్చే స్పందన ఆధారంగా దీన్ని ఆ తర్వాత రాత్రి 11.55 గంటల వరకు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకు ట్రేడింగ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

12.7 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్‌ మదుపర్ల ఆసక్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డీమ్యాట్‌ ఖాతాల్లో వృద్ధి కనిపిస్తోంది. ఆగస్టులో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 26 శాతం పెరిగి, మొత్తమ్మీద 12.7 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 21 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నివేదిక వెల్లడించింది. ఈ జులైలో 30 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభం కాగా, ఆగస్టులో 31 లక్షల కొత్త ఖాతాలు జత అయ్యాయని పేర్కొంది. గత ఏడాది ఆగస్టు నాటికి 10.1 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలున్నాయి. మొత్తం డీమ్యాట్‌ ఖాతాల్లో ఎన్‌ఎస్‌డీఎల్‌లో 3.3 కోట్లు, సీడీఎస్‌ఎల్‌లో 9.35 కోట్ల మేరకు ఖాతాలున్నాయని సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని