LuLu Mall - Hyderabad: హైదరాబాద్‌లో లులు మాల్‌

అంతర్జాతీయంగా రిటైల్‌ కేంద్రాలను నిర్వహిస్తున్న లులు గ్రూపు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది.

Updated : 27 Sep 2023 08:17 IST

5 లక్షల చ.అడుగుల విస్తీర్ణం
రూ.300 కోట్ల పెట్టుబడి
నేడు కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయంగా రిటైల్‌ కేంద్రాలను నిర్వహిస్తున్న లులు గ్రూపు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన లులు మాల్‌ను నేడు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, లులు గ్రూపు ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ యూసఫ్‌ అలి ఎం.ఎ.తో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో లులు గ్రూపు ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అష్రఫ్‌ అలి ఎం.ఎ. మాట్లాడుతూ.. అయిదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన లులు మాల్‌ హైదరాబాద్‌కు సరికొత్త ఆకర్షణగా మారనుందని తెలిపారు. ఇందులో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైపర్‌ మార్కెట్‌ ఉందన్నారు. దేశవ్యాప్తంగా లులు గ్రూప్‌నకు కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లఖ్‌నవూ, కోయంబత్తూర్‌లలో ఇప్పటికే మాల్స్‌ ఉండగా.. హైదరాబాద్‌ మాల్‌ ఆరోదని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రంలో తొలి దశలో రూ.500 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా ఈ మాల్‌ను ప్రారంభించాం. దీనికోసం రూ.300 కోట్ల వరకూ కేటాయించాం. ఈ మాల్‌ 1,500 వరకూ ప్రత్యక్ష, 2,000 వరకూ పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తుంది. 80-85 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాం. రోజుకు కనీసం 30 వేల మంది ఈ మాల్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నాం. పళ్లు, కూరగాయలు, మాంసం తదితర తాజా ఉత్పత్తులు, కిరాణా సామగ్రి, దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌, మొబైల్స్‌, జీవన శైలి ఉత్పత్తులు లభిస్తాయి. 100కు పైగా దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ల అవుట్‌లెట్లు ఉంటాయి. నగరంలో ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఉంటున్నారు. వారికి అవసరమైన అన్ని వస్తువులూ ఇక్కడ దొరుకుతాయి’ అని తెలిపారు. 1,400 మంది సామర్థ్యంతో అయిదు సినిమా స్క్రీన్లు, 500 మంది కూర్చునే వసతి ఉన్న ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లూ ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 20,000 చ.అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక వినోద స్థలమూ  ఉందన్నారు.

ఇతర నగరాలకూ..: ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ చిన్న పరిమాణంలో స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అష్రఫ్‌ వెల్లడించారు. ఎక్కడ ఏర్పాటు చేస్తామన్న విషయంపై ఇంకా స్పష్టత లేదని, పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించాకే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ శివారులోని చెంగిచెర్లలో మాంసం శుద్ధి చేసేందుకు అధునాతన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి మాంసాన్ని ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.200 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆహార, చేపల ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకూ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల విషయంపై అడిగిన ప్రశ్నకు ‘ఇది సందర్భం కాదు’ అన్నారు.

రెండున్నర ఏళ్లలో డెస్టినేషన్‌ మాల్‌

హైదరాబాద్‌లో డెస్టినేషన్‌ మాల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు అష్రఫ్‌ అలి  తెలిపారు. దాదాపు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రాబోతోందని, రూ.1,200 కోట్ల వరకూ పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. వచ్చే రెండున్నర ఏళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు