డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలు పెరిగాయ్‌

డిజిటల్‌ చెల్లింపుల్లో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు పెరిగాయని వరల్డ్‌లైన్‌ నివేదిక వెల్లడించింది.

Published : 27 Sep 2023 05:03 IST

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల్లో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు పెరిగాయని వరల్డ్‌లైన్‌ నివేదిక వెల్లడించింది. గత ఆగస్టులో 1,000 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు పేర్కొంది. పర్సన్‌-టు-మర్చంట్‌ (పీ2ఎం) లావాదేవీలు అధికంగా జరగడంతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. 2018 జనవరిలో యూపీఐ లావాదేవీలు 15.1 కోట్లు కాగా, 2023 జూన్‌ నాటికి 930 కోట్లకు చేరాయని నివేదిక పేర్కొంది. 2022 జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీల్లో పీ2ఎం లావాదేవీల వాటా 40.3 శాతం ఉండగా, 2023 జూన్‌ నాటికి 57.5 శాతానికి చేరిందని వివరించింది. భవిష్యత్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. యూపీఐ పీ2ఎం లావాదేవీల సరాసరి టికెట్‌ పరిమాణం (ఏటీఎస్‌) 2022 జనవరిలో రూ.885 కాగా, 2023 జూన్‌ నాటికి రూ.653గా ఉందని తెలిపింది. లావాదేవీలు పెరిగినా, ఏటీఎస్‌ తగ్గడం చూస్తుంటే, వినియోగదార్లు చిన్న మొత్తం (మైక్రో) లావాదేవీలను సైతం యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారని అర్థమవుతోందని వెల్లడించింది.

ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు (ఈటీసీ) కూడా గణనీయంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 2022 జనవరిలో జారీ చేసిన ట్యాగ్‌లు 4.58 కోట్లు కాగా, 2023 జూన్‌లో 56.5 శాతం పెరిగి 7.19 కోట్లకు చేరాయని వివరించింది. పరిమాణం పరంగా చూస్తే, 2023 తొలి అర్ధ భాగంలో 185 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2022 తొలి 6 నెలల్లో 157 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 17.6 శాతం పెరిగాయి. విలువ పరంగా ఈటీసీ లావాదేవీలు 25.3 శాతం మేర పెరిగి ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.30,340 కోట్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని