ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకరణ

ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో మంగళవారం సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

Published : 27 Sep 2023 05:03 IST

సమీక్ష

ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో మంగళవారం సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బలహీన ఆసియా సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు తగ్గి 83.28 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.79% నష్టపోయి 92.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 66,071.63 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీ.. ఒక దశలో 65,865.63 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 78.22 పాయింట్ల నష్టంతో 65,945.47 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 9.85 పాయింట్లు తగ్గి 19,664.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 19,637.45- 19,699.35 పాయింట్ల మధ్య కదలాడింది.

  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 డీలాపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.29%, టెక్‌ మహీంద్రా 1.28%, కోటక్‌ బ్యాంక్‌ 1.24%, ఇన్ఫోసిస్‌ 1%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.89%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.83%, టైటన్‌ 0.75%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.56% చొప్పున నష్టపోయాయి. నెస్లే, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.58% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ 0.46%, బ్యాంకింగ్‌ 0.45%, టెక్‌ 0.36%, మన్నికైన వినిమయ వస్తువులు 0.23%, ఆర్థిక వలు 0.21% నీరసించాయి. కమొడిటీస్‌, వినియోగ, ఎఫ్‌ఎమ్‌సీజీ, పరిశ్రమలు, టెలికాం పెరిగాయి. బీఎస్‌ఈలో 1861 షేర్లు నష్టాల్లో ముగియగా, 1803 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 129 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • రూ.1,040.5 కోట్ల విలువైన ఏఏఏ రేటింగ్‌ సామాజిక బాండ్లను జారీ చేసినట్లు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్‌ (నాబార్డ్‌) వెల్లడించింది. అయిదేళ్ల కాలవ్యవధి కలిగిన ఈ బాండ్లను సంస్థాగత మదుపర్లకు జారీ చేస్తారు. సెప్టెంబరు 29న బీఎస్‌ఈలో ఇవి నమోదుకానున్నాయి.
  • ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌తో కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును జారీ చేసేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చినట్లు సైరస్‌ పూనావాలా గ్రూప్‌ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్‌ తెలిపింది. వచ్చే మూడు నెలల్లో ఈ క్రెడిట్‌ కార్డును తీసుకురానుంది.
  • హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆసుపత్రులు, ఫార్మసీలకు కీలకమైన ఔషధాలను అందించేందుకు డ్రోన్‌ ఆధారిత డెలివరీలను తీసుకొచ్చినట్లు సిప్లా పేర్కొంది. ఇందుకోసం స్కై ఎయిర్‌ మొబిలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
  • కోంటార్‌ స్పేస్‌ ఐపీఓ బుధవారం ప్రారంభమై అక్టోబరు 3న ముగియనుంది. ఒక్కో షేరు రూ.93 చొప్పున విక్రయించడం ద్వారా రూ.15.62 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకానున్నాయి.
  • పలు రకాల పరిశ్రమల వారీగా కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్‌లను అందించేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఇన్ఫోసిస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని