ఏఐ, క్లౌడ్‌తో లాభాలే లాభాలు

కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్‌ వంటి కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెట్టేందుకు వివిధ వ్యాపార సంస్థలు ఆసక్తిగా ముందుకు వస్తున్నట్లు అగ్రశ్రేణి కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన కేపీఎంజీ స్పష్టం చేసింది.

Updated : 28 Sep 2023 07:30 IST

కొత్త తరం సాంకేతికతపై పెట్టుబడులు పెట్టేందుకు సంస్థల ఆసక్తి
పెరుగుతున్న ఉద్యోగుల సామర్థ్యం
కేపీఎంజీ ‘గ్లోబల్‌ టెక్‌ రిపోర్ట్‌’ విశ్లేషణ
ఈనాడు - హైదరాబాద్‌

కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్‌ వంటి కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెట్టేందుకు వివిధ వ్యాపార సంస్థలు ఆసక్తిగా ముందుకు వస్తున్నట్లు అగ్రశ్రేణి కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన కేపీఎంజీ స్పష్టం చేసింది. అంతేగాక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ద్వారా అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశాన్ని ఆయా సంస్థలు అందిపుచ్చుకుంటున్నట్లు పేర్కొంది. ‘కేపీఎంజీ గ్లోబల్‌ టెక్‌ రిపోర్ట్‌ 2023’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం...

  • కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆసక్తి ప్రదర్శిస్తున్న వ్యాపారవేత్తల సంఖ్య 10 శాతం నుంచి గత ఏడాదిలో 38 శాతానికి పెరిగింది.
  • కృత్రిమ మేధ(ఏఐ)ను ఎంతో ముఖ్యమైన టెక్నాలజీగా ఎక్కువ మంది పరిగణిస్తున్నారు. స్వల్పకాలానికి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏఐ ఎంతగానో దోహదపడుతుందని విశ్వసిస్తున్నారు.
  • డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యోగుల సామర్థ్యం బాగా పెరిగినట్లు 72 శాతం మంది ‘డిజిటల్‌ లీడర్స్‌’ స్పష్టం చేశారు.
  • ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంట్‌, సోషల్‌ గవర్నెన్స్‌) లక్ష్యాల సాధనకు నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రధానోద్దేశంగా, చోదక శక్తిగా కనిపిస్తోంది.
  • నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలు, డిజిటల్‌ పెట్టుబడులు అధికంగా పెట్టడం ద్వారా వినియోగదార్లకు సరికొత్త అనుభూతిని అందించడం సాధ్యమని ఎక్కువ మంది వ్యాపారవేత్తలు, బిజినెస్‌ లీడర్స్‌ భావిస్తున్నారు.
  • నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి  సమన్వయంతో కూడిన చర్యలు అవసరమని, ఇదే పెద్ద సవాలు అనేది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది.

10 శాతానికి పైగా అధిక లాభాలు: దాదాపు 2,100 మంది టెక్నాలజీ లీడర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను కేపీఎంజీ సిద్ధం చేసింది. ఇందులో 29 శాతం మంది ఆసియా, పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన వారు కాగా, అమెరికా నుంచి 33 శాతం మంది ఉన్నారు. ఇంధనం, విద్య, ఆర్థిక సేవలు, ప్రభుత్వం, ఆరోగ్య రంగం, పారిశ్రామిక ఉత్పత్తి, టెక్నాలజీ, రిటైల్‌, ప్యాక్‌ చేసిన ఆహార పదార్ధాల పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యాపారవేత్తలు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో ఉన్నారు. అవసరమైన పెట్టుబడులు పెట్టి అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసినట్లయితే లాభాలు 10 శాతానికి పైగా పెరుగుతున్నట్లు ఎక్కువ మంది స్పష్టం చేశారు. కృత్రిమ మేధ, డేటా, అనలిటిక్స్‌, ఎక్స్‌ఏఏఎస్‌ (ఎనీథింగ్‌ యాస్‌ ఏ సర్వీస్‌) టెక్నాలజీలపై అధికంగా పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది సుముఖంగా ఉన్నారు. వినియోగదార్ల సంతృప్తి, ఈఎస్‌జీ, సైబర్‌ సెక్యూరిటీలను దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీలను అమలు చేయడానికి  వ్యాపార సంస్థలు ముందుకు వస్తున్నాయని ఈ నివేదిక విశ్లేషించింది. ఏఐ, ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నులను సమూలంగా మార్చివేస్తున్నట్లు కేపీఎంజీ ఇండియా భాగస్వామి, లైట్‌హౌస్‌ (డేటా, ఏఐ, అనలిటిక్స్‌) హెడ్‌ సచిన్‌ అరోరా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని