2023-24లో జీడీపీ వృద్ధి 6.5%

దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 6.5 శాతంగా నమోదు కావొచ్చని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అంచనా వేశారు.

Published : 03 Oct 2023 01:54 IST

నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

దిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 6.5 శాతంగా నమోదు కావొచ్చని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అంచనా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 9 ఏళ్లుగా తీసుకొచ్చిన సంస్కరణలు దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై సానుకూల ప్రభావం చూపాయని పేర్కొన్నారు. దేశ యువత ఆకాంక్షలకు తగ్గట్లు సరిపడా ఉద్యోగాల సృష్టికి 8 శాతం పైన ఆర్థిక వృద్ధి నమోదు కావాల్సిన అవసరం ఉందని, ఇది సాధ్యమేనని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉండటంతో పాటు, వచ్చే కొన్నేళ్లపాటు ఇది స్థిరంగా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. 2022-23లో దేశ ఆర్థిక వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. 2021-22లో ఇది 9.1 శాతంగా ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాల ప్రకారం, దేశ జీడీపీ వృద్ధి 2023-24లో 6.5 శాతంగా నమోదు కావొచ్చు.

  • బాహ్య స్థూల ఆర్థికానికి, దేశీయ ఆర్థిక పరిస్థితులకు సమతౌల్యం ఉందని, స్థూలంగా ఆర్థిక పరిస్థితులు మంచి స్థితిలో ఉన్నాయని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. కరెంట్‌ ఖాతా లోటు అదుపులోనే ఉందని, దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 11 నెలల దిగుమతులకు సరిపోయేలా ఉన్నాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దేశీయంగా చూస్తే ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయిలకు దగ్గరగా వస్తోందని, పన్ను ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే 16 శాతం పెరిగి మంచి స్థితిలో ఉందని వెల్లడించారు. ఇవన్నీ దేశ ఆర్థిక స్థితిని సరిగ్గా చూసుకుంటాయని, ఆర్థిక స్థిరీకరణ జరుగుతుందని వివరించారు. రేటింగ్‌ ఏజెన్సీలు మన దేశ రేటింగ్‌ను పెంచుతున్నాయని, జేపీ మోర్గాన్‌ భారత్‌ను అంతర్జాతీయ బాండ్ల సూచీలో చేర్చడం దీనికి ఒక నిదర్శనమని పేర్కొన్నారు.
  • దేశ ఎగుమతులకొస్తే ఏప్రిల్‌-ఆగస్టులో 11 శాతం తగ్గడంపై రాజీవ్‌ స్పందిస్తూ.. అంతర్జాతీయ వాణిజ్య పని తీరుతో మన దేశం బలంగా సహసంబంధాలు కలిగి ఉండటంతో ఎగుమతులు తగ్గాయన్నారు. ఐరోపా, యూఎస్‌, ఇతర అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో బలహీన గిరాకీ ఉండటంతో అంతర్జాతీయ వాణిజ్యం కూడా స్తబ్దుగా ఉందని, మన దేశం కూడా దీన్ని అనుసరించిందని వివరించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు