వైభవ్‌ జ్యువెలర్స్‌ షేర్ల నమోదు నేడే

గత త్రైమాసికంలో (జులై- సెప్టెంబరు) ఎక్కువ సంఖ్యలో పబ్లిక్‌ ఇష్యూలు సందడి చేశాయి. అయితే ఈ త్రైమాసికం (అక్టోబరు- డిసెంబరు) స్తబ్దుగానే మొదలుకానుంది.

Published : 03 Oct 2023 05:31 IST

మరో 6 కంపెనీలవి ఈ వారంలోనే
14 పబ్లిక్‌ ఇష్యూల ముగింపు కూడా
స్తబ్దుగా ప్రారంభమవుతున్న అక్టోబరు- డిసెంబరు త్రైమాసికం

త త్రైమాసికంలో (జులై- సెప్టెంబరు) ఎక్కువ సంఖ్యలో పబ్లిక్‌ ఇష్యూలు సందడి చేశాయి. అయితే ఈ త్రైమాసికం (అక్టోబరు- డిసెంబరు) స్తబ్దుగానే మొదలుకానుంది. ఈవారం కొత్త పబ్లిక్‌ ఇష్యూలు లేకపోవడమే ఇందుకు కారణం. అయితే ప్రధాన, ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫామ్‌లపై గత నెల చివర్లో ప్రారంభమైన 14 కంపెనీల తొలి పబ్లిక్‌ ఆఫర్‌లు (ఐపీఓలు) ఈవారంలోనే ముగియనున్నాయి. అలాగే ఏడు కంపెనీల షేర్లు ఇదే వారంలో ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి.

ప్రధాన ప్లాట్‌ఫాంపై

  • ఔషధ కంపెనీ వాలియంట్‌ లేబొరేటరీస్‌ పబ్లిక్‌ ఇష్యూ అక్టోబరు 3న ముగియనుంది. ఇప్పటివరకు ఈ సంస్థ ఐపీఓకు 2.17 రెట్ల స్పందన లభించింది. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా రూ.152 కోట్లు సమీకరించాలని వాలియంట్‌ లేబొరేటరీస్‌ భావిస్తోంది.
  • దిల్లీ కేంద్రంగా వైర్ల తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ప్లాజా వైర్స్‌ ఐపీఓకు చివరి తేదీ అక్టోబరు 5. ఇష్యూ సెప్టెంబరు 29న ప్రారంభమైంది. తొలి రోజున 4.68 రెట్ల మేర అధికంగా షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి.

ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై

  • ఐటీ సొల్యూషన్ల సంస్థ కేనరీస్‌ ఆటోమేషన్స్‌, లాజిస్టిక్స్‌ సంస్థ వన్‌క్లిక్‌ లాజిస్టిక్స్‌ ఇండియా ఇష్యూలు అక్టోబరు 3న ముగియనున్నాయి. ఈ రెండు సంస్థల ఇష్యూలకు ఇప్పటివరకు వరుసగా 98 శాతం, 16.49 రెట్ల స్పందన లభించింది.
  • ఎలక్ట్రానిక్స్‌ తయారీ సేవల సంస్థ విన్యాస్‌ ఇన్నోవేటివ్‌ టెక్నాలజీస్‌, ఈవెంట్‌ల నిర్వహణ సంస్థ ఈ ఫ్యాక్టర్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌, ముడి ఉప్పు శుద్ధి సంస్థ గోయల్‌ సాల్ట్‌ పబ్లిక్‌ ఇష్యూలు కూడా అక్టోబరు 3వ తేదీనే ముగియనున్నాయి. వీటికి ఇప్పటివరకు వరుసగా 3.03 రెట్లు, 3.77 రెట్లు, 103.71 రెట్ల మేర స్పందన లభించడం విశేషం. ఇవే కాకుండా కొంటోర్‌ స్పేస్‌, సునీతా టూల్స్‌ ఐపీఓలకు కూడా అక్టోబరు 3వ తేదీనే చివరి రోజు. ఈ రెండు సంస్థలు ఐపీఓలో భాగంగా జారీ చేసిన షేర్లకుగాను ఇప్పటివరకు వరుసగా 15.76 రెట్లు, 8.72 రెట్ల మేర అధికంగా షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి.
  • ఇప్పటివరకు వరుసగా 12 శాతం, 1.33 రెట్ల మేర స్పందన లభించిన కర్ణిక ఇండస్ట్రీస్‌, ప్లాడా ఇన్ఫోటెక్‌ సర్వీసెస్‌ ఐపీఓలకు ముగింపు తేదీ అక్టోబరు 5. షార్ప్‌ చక్స్‌ అండ్‌ మెషీన్స్‌, విష్ణుసూర్య ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాల ఇష్యూలు కూడా ఇదే రోజు ముగియనున్నాయి. వీటికి ఇప్పటివరకు 93 శాతం, 78 శాతం మేర స్పందన లభించింది. వివా ట్రేడ్‌కామ్‌ ఐపీఓ అక్టోబరు 4న ముగియనుండగా.. ఇప్పటివరకు 50 శాతం మేర షేర్లకే బిడ్‌లు వచ్చాయి.

నమోదయ్యేవి ఇవే..

  • ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఆభరణాల విక్రయాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న వైభవ్‌ జ్యువెలర్స్‌ షేర్లు నేడు ఎక్స్ఛేంజీల్లో అడుగుపెట్టనున్నాయి. దేశంలోని రెండో అతిపెద్ద వాణిజ్య ఓడరేవుల నిర్వాహక సంస్థ అయిన జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేర్లు కూడా ఈ వారంలోనే (అక్టోబరు 3న)    ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి.
  • ఎస్‌ఎమ్‌ఈ విభాగంలో సాక్షి మెడ్‌టెక్‌ అండ్‌ ప్యానెల్స్‌ షేర్లు అక్టోబరు 3న, మంగళం ఎల్లాయ్స్‌, డిజికోర్‌ స్టూడియోస్‌ షేర్లు అక్టోబరు 4న నమోదు కానున్నాయి. ఆర్గానిక్‌ రీసైక్లింగ్‌ సిస్టమ్స్‌, ఇన్‌స్పైర్‌ ఫిల్మ్స్‌ షేర్లలో ట్రేడింగ్‌ అక్టోబరు 5 నుంచి మొదలుకానుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు