ఐటీ ఫలితాలు.. అంతంతే!

ఎప్పటిలాగే కార్పొరేట్‌ సంస్థల ఫలితాల సీజనులో ముందుగా గణాంకాలను ప్రకటించడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.

Updated : 03 Oct 2023 07:22 IST

గిరాకీలో బలహీనతలు, స్థూల అనిశ్చితుల వల్లే
సెప్టెంబరు త్రైమాసికంపై నొమురా అంచనాలు

ప్పటిలాగే కార్పొరేట్‌ సంస్థల ఫలితాల సీజనులో ముందుగా గణాంకాలను ప్రకటించడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి ఫలితాలు ఈసారి గొప్పగా ఏమీ ఉండకపోవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనా వేస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా గిరాకీలో బలహీనతలు, స్థూల అనిశ్చితులు ఇందుకు కారణమవుతాయని భావిస్తోంది.

కారణాలెన్నో..

దేశీయ ఐటీ కంపెనీలకు పెద్ద ప్రాజెక్టులు తగ్గాయి. చిన్న చిన్న ప్రాజెక్టులకే పరిమితం కావడంతో పాటు.. క్లయింట్ల నిర్ణయాల్లో ఆలస్యమవడంతో ప్రాజెక్టులను దక్కించుకోవడం, వేగంగా పూర్తి చేయడం ఐటీ సంస్థలకు క్లిష్టతరమైంది. దీంతో స్వల్పకాలంలో ఐటీ కంపెనీల ఆదాయాలు, మార్జిన్లు నిరుత్సాహపరచే అవకాశం ఉందని నొమురా విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి త్రైమాసికం వారీగా చూస్తే -1 శాతం నుంచి 2 శాతం మేరే ఉండొచ్చని అంటోంది. మధ్య స్థాయి కంపెనీలు మాత్రం 0.7%-3.3 శాతం వరకు రాణించే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ స్థిర కరెన్సీ లెక్కన గణించినవి. పెద్ద స్థాయి ఐటీ కంపెనీల్లో ఎల్‌టీఐమైండ్‌ట్రీ అత్యధికంగా త్రైమాసికం వారీగా 2% వరకు ఆదాయ వృద్ధిని నమోదు చేయొచ్చు. టెక్‌ మహీంద్రా మాత్రం అన్నిటి కంటే తక్కువగా -1 శాతం అంటే ఆదాయ వృద్ధి 1% మేర క్షీణించొచ్చు. మధ్య స్థాయి కంపెనీల విషయానికొస్తే బిర్లాసాఫ్ట్‌ 3.3 శాతం మేర రాణించే అవకాశాలు కనిపిస్తుండగా. ఎంఫసిస్‌ మాత్రం అన్నిటికంటే బలహీనంగా 0.7 శాతం మేర ఆదాయంలో వృద్ధిని నమోదుచేయొచ్చు.

వేతన పెంపులతో ఒత్తిడి..

ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఎల్‌ అండ్‌ టీ వంటి దిగ్గజాల ఎబిట్‌ మారిన్లపై వేతన పెంపులు, బలహీన ఆదాయ వృద్ధి ప్రభావం చూపించొచ్చు. మొత్తం మీద ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరు వైవిధ్యంగా ఉండడంతో ఫలితాల సమయంలో ఆయా యాజమాన్యాలు తమ ఒప్పందాలు, ప్రాజెక్టుల వేగంపై చేసే వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. కాగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌లు మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాలను కొనసాగించే అవకాశం ఉందని అంచనా.

జాగ్రత్త ధోరణి తప్పదా?

ఐటీ కంపెనీల వృద్ధి పథానికి ఎదురయ్యే అడ్డంకులను దృష్టిలో పెట్టుకుంటే స్వల్పకాలంలో ఈ రంగంపై జాగ్రత్త ధోరణి తప్పకపోవచ్చని నొమురా అంటోంది. ఐటీ సేవలకు గిరాకీ పుంజుకోవడానికి, అది కూడా ఎంచదగ్గరీతిలో రాణించేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటోంది. ప్రస్తుత మందగమన ప్రభావం 2023-24 ప్రథమార్ధంపైనే కాకుండా మొత్తం ఆర్థిక సంవత్సరంపై కనిపించొచ్చని.. 2024-25కూ ఈ ధోరణి కొనసాగే అవకాశమూ లేకపోలేదంటోంది.

మధ్యకాలానికి సానుకూలతలు

మధ్యకాలంలో మాత్రం ఆఫ్‌షోరింగ్‌ వర్క్‌ విషయంలో భారత ఐటీ సేవలకు గిరాకీ పెరగొచ్చని నొమురా చెబుతోంది. ఆటోమేషన్‌, వ్యయ నియంత్రణలకు ఆయా రంగాల కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఐటీ బడ్జెట్‌లు స్వల్పకాలంలో పెరగొచ్చని ముఖ్యంగా.. బీఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా), సీఎమ్‌టీ(కమ్యూనికేషన్స్‌, మీడియా, టెక్నాలజీ) విభాగాలను గమనించాల్సి ఉంటుందని చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు