Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్‌

మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా పేరుపొందిన నిమ్మగడ్డ ప్రసాద్‌ దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫార్మా రంగంలో అడుగు పెడుతున్నారు.

Updated : 03 Oct 2023 10:03 IST

ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చేతికి ‘వియాట్రిస్‌’ భారత ఏపీఐ వ్యాపారం
ఒప్పందం ఖరారు

ఈనాడు - హైదరాబాద్‌: మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా పేరుపొందిన నిమ్మగడ్డ ప్రసాద్‌ దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫార్మా రంగంలో అడుగు పెడుతున్నారు. మ్యాట్రిక్స్‌ లేబొరేటరీస్‌ను ఆయన 2006లో యూఎస్‌కు చెందిన ఫార్మా దిగ్గజం మైలాన్‌ ల్యాబ్స్‌కు విక్రయించిన విషయం విదితమే. ఆ తర్వాత ఆయన వివిధ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఫార్మా రంగం వైపు చూడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి ఫార్మా పరిశ్రమలోకి నేరుగా అడుగుపెట్టబోతున్నారు. ఆయన కుటుంబానికి చెందిన ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, యూఎస్‌లో ఔషధ దిగ్గజ సంస్థ అయిన వియాట్రిస్‌కు మనదేశంలో ఉన్న ఔషధ వ్యాపారం, యూనిట్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.  ‘గ్లోబల్‌ కాంపిటీటివ్‌ బిడ్‌’ లో వియాట్రిస్‌ భారత వ్యాపార కార్యకలాపాలు, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం తనకు దక్కినట్లు ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సోమవారం ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించింది.

వియాట్రిస్‌కు మనదేశంలో 6 ఫార్మా యూనిట్లు ఉన్నాయి. ఇందులో మూడు యూనిట్లు వైజాగ్‌లో, మరో 3 యూనిట్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇవేకాకుండా హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌డీ కేంద్రం, ఏపీఐ థర్డ్‌ పార్టీ విక్రయాల విభాగం ఉన్నాయి. ఈ యూనిట్లలో కొన్ని గతంలో మ్యాట్రిక్స్‌ లేబొరేటరీస్‌కు చెందినవి కావటం గమనార్హం. మ్యాట్రిక్స్‌ను మైలాన్‌ ల్యాబ్స్‌ కొనుగోలు చేయగా, ఆ తర్వాత  మైలాన్‌ మరొక సంస్థలో విలీనమై వయాట్రిస్‌గా మారింది. మ్యాట్రిక్స్‌ యూనిట్లే అటు ఇటూ తిరిగి మళ్లీ ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చేతికి రావటం ఆసక్తికర అంశంగా మారింది.

ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు నిమ్మగడ్డ ప్రసాద్‌ ముఖ్య సలహాదారుడిగా, ప్యాట్రన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఏఐజీ హాస్పిటల్స్‌, కేర్‌ హాస్పిటల్స్‌, మాటీవీ, సెలాన్‌ లేబొరేటరీస్‌.. తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. మళ్లీ ఔషధ రంగంలో అడుగు పెడుతున్నందుకు తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు నిమ్మగడ్డ ప్రసాద్‌ కుమార్తె, ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గునుపాటి స్వాతిరెడ్డి అన్నారు. ఫార్మా రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా పరిశ్రమలో మనదేశం క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో, ఈ రంగంలోకి వస్తున్నామని పేర్కొన్నారు. మరోరకంగా చెప్పాలంటే.. సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లుందని పేర్కొన్నారు.

విలువ రూ. 10,000 కోట్లు?

మనదేశంలోని ఏపీఐ వ్యాపారం, ఉమెన్స్‌ హెల్త్‌కేర్‌ బిజినెస్‌.. రెండింటినీ కలిపి 1.2 బిలియన్‌ డాలర్ల  (దాదాపు రూ.10,000 కోట్లు) విలువకట్టి ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఇన్సడ్‌ ఫార్మాలకు వియాట్రిస్‌ విక్రయించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లావాదేవీ వచ్చే ఆరు నెలల వ్యవధిలో పూర్తవుతుందని అంచనా. వియాట్రిస్‌ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కొన్ని వ్యాపార విభాగాలను విక్రయించటానికి గత కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మనదేశంలో తన వ్యాపారాన్ని, యూనిట్లను విక్రయించటానికి ముందుకొచ్చినట్లు స్పష్టమవుతోంది.

‘ఉమెన్స్‌ హెల్త్‌కేర్‌ బిజినెస్‌’ స్పానిష్‌ సంస్థ చేతికి

మనదేశంలో తనకు ఉన్న ‘ఉమెన్స్‌ హెల్త్‌కేర్‌ బిజినెస్‌’ ను కూడా విక్రయించటానికి వియాట్రిస్‌ సిద్ధమైంది. ఈ వ్యాపారాన్ని స్పానిష్‌ సంస్థ అయిన ఇన్సడ్‌ ఫార్మాకు విక్రయించటానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద ఓరల్‌, ఇంజెక్టబుల్‌ కాంట్రాసెప్టివ్‌ ఉత్పత్తులు ఉన్నాయి. దీనికి అహ్మదాబాద్‌, సరిగమ్‌ లో యూనిట్లు ఉన్నాయి. ఏపీఐ యూనిట్లు, వ్యాపారాన్ని 2007లో మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ నుంచి కొనుగోలు చేసినట్లుగానే ‘ఉమెన్స్‌ హెల్త్‌కేర్‌ బిజినెస్‌’ను 2015లో ముంబయికి చెందిన తపారియా కుటుంబం నుంచి మైలాన్‌ కొనుగోలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని