సవాళ్లున్నా పౌల్ట్రీ రంగ వృద్ధి

సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని, పౌల్ట్రీ రంగం వృద్ధి సాధిస్తోందని ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐపీఈఎంఏ) అధ్యక్షులు ఉదయ్‌ సింగ్‌ బయాస్‌ వెల్లడించారు.

Published : 21 Nov 2023 02:16 IST

ఐపీఈఎంఏ ప్రెసిడెంట్‌ ఉదయ్‌ సింగ్‌ బయాస్‌

హైదరాబాద్‌ (బంజారాహిల్స్‌), న్యూస్‌టుడే: సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని, పౌల్ట్రీ రంగం వృద్ధి సాధిస్తోందని ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐపీఈఎంఏ) అధ్యక్షులు ఉదయ్‌ సింగ్‌ బయాస్‌ వెల్లడించారు. మన దేశం కోడి గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానం, కోడిమాంసం ఉత్పత్తిలో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలోనూ ఉందని తెలిపారు. దేశంలో పౌష్ఠికాహార లోపాన్ని నివారించడంలో పౌల్ట్రీ రంగం ఎంతో కీలకంగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఈ నెల 22-24 తేదీల్లో 15వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షులు కాసర్ల మోహన్‌రెడ్డి, ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ చిట్టూరి సురేష్‌ రాయుడు, ఐపీఈఎంఏ డైరెక్టర్లు అనిల్‌ ధుమాల్‌, పి.చక్రధర్‌రావు, తెలంగాణ బ్రాయిలర్‌ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డి.రాఘవరావు తదితరులతో కలిసి మాట్లాడారు. మన దేశం నుంచి 380 కంపెనీలు, మరో 22 దేశాల నుంచి 45 సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించబోతున్నట్లు పేర్కొన్నారు. 35 వేలకు మందికి పైగా రైతులు దీనికి హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ప్రారంభ వేడుకల్లో దేశ, విదేశాల శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకుంటారని తెలిపారు. దేశీయంగా ప్రత్యక్షంగా లక్షల్లో, పరోక్షంగా కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు. సురేశ్‌ రాయుడు మాట్లాడుతూ.. కోళ్ల దాణా ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. గుడ్డు ధర తక్కువగా ఉండటం, ఉత్పత్తి ధర పెరగడంతో చాలామంది ఈ రంగానికి దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో గుడ్ల ధరలు కాస్త పెరగడంతో మళ్లీ కొందరు తిరిగి ఈ రంగంలోకి వస్తున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని