2024లో వృద్ధి 6.3 శాతానికి తగ్గొచ్చు

వచ్చే సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి స్వల్పంగా 6.3 శాతానికి తగ్గే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది. 2023లో జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.

Updated : 21 Nov 2023 06:31 IST

ఎన్నికల సంవత్సరంలో  రాజకీయ అనిశ్చితే ప్రధాన ముప్పు

ముంబయి: వచ్చే సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి స్వల్పంగా 6.3 శాతానికి తగ్గే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది. 2023లో జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ‘వచ్చే సంవత్సరం రెండు విభాగాలుగా ఉండనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యయాలు వృద్ధికి కీలకం అవుతాయి. ఎన్నికల తర్వాత పెట్టుబడుల వృద్ధి మళ్లీ వేగవంతం కావడంపై వృద్ధి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులు’ అని గోల్డ్‌మన్‌ శాచ్స్‌ తన నివేదికలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2024-25లో జీడీపీ వృద్ధి 6.5 శాతానికి పెరగొచ్చు. 2023-24లో ఇది 6.2 శాతంగా ఉందని తెలిపింది. ‘భారత్‌కు వృద్ధిపరంగా అత్యుత్తమ వ్యవస్థీకృత అవకాశాలు ఉన్నాయి. 2024లో జీడీపీ వృద్ధి 6.3 శాతంగా ఉండొచ్చ’ని వెల్లడించింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరగడం, డాలరు బలోపేతం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు లాంటి విదేశీ కుదుపుల ప్రభావం భారత్‌పై పరిమితంగానే ఉండొచ్చని వివరించింది. వృద్ధికి పొంచి ఉన్న ముప్పులను తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ.. 2024 ఏప్రిల్‌- జూన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వల్ల కలిగే రాజకీయ అనిశ్చితుల నుంచే ప్రధాన ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ఇప్పటికే ఎన్నికల సీజను ప్రారంభమైంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగునున్నాయి. ఆర్థిక సంస్కరణలు, విధానాలు కొనసాగుతాయా? లేదా? అనే అంశం ఆధారంగా ఈ ఎన్నికల ఫలితాలను మదుపర్లు నిశితంగా గమనించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

5.1 శాతానికి ద్రవ్యోల్బణం: వచ్చే ఏడాదిలో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) 5.1 శాతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్‌బీఐ 4.7 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే 2023కు అంచనా వేసిన 5.7 శాతం కంటే కూడా తమ అంచనా అయిన 5.1 శాతం తక్కువే కావడం గమనార్హం. ఎన్నికల సంవత్సరంలో ఆహార పదార్థాల ధరల నియంత్రణకు సబ్సిడీలు లేదా ఇతరత్రా చర్యల ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. 2025 ప్రారంభంలో ఆర్‌బీఐ కీలక రేట్లను 0.50 శాతం తగ్గి 6 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ తెలిపింది. 2024 నాలుగో త్రైమాసికంలో పావు శాతం కోత ఉండే అవకాశం ఉందని వివరించింది. 2024లో జీడీపీ 1.9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2023లో దీనిని 1.3 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2024 చివరికల్లా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 82కు పెరిగే అవకాశం ఉంది. 2023 చివరినాటికి ఇది 83 స్థాయిల వద్ద ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని