వాహన, కమొడిటీ షేర్లు డీలా

వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. గరిష్ఠ స్థాయుల్లో వాహన, యుటిలిటీ, కమొడిటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడమే ఇందుకు కారణం.

Published : 21 Nov 2023 02:21 IST

డాలర్‌ @ రూ.83.38
సమీక్ష

రుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. గరిష్ఠ స్థాయుల్లో వాహన, యుటిలిటీ, కమొడిటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడమే ఇందుకు కారణం. అయితే ఐటీ షేర్లు రాణించడంతో సూచీలకు నష్టాలు పరిమితం అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు క్షీణించి తాజా జీవనకాల కనిష్ఠమైన 83.38 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.74% పెరిగి 81.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో నష్టపోగా, మిగతావి లాభపడ్డాయి. ఐరోపా షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 65,787.51 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కదలాడిన సూచీ, 65,547.80 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు 139.58 పాయింట్ల నష్టంతో 65,655.15 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.80 పాయింట్లు తగ్గి 19,694 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 19,670.50- 19,756.45 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 నష్టపోయాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 2.11%, ఎం అండ్‌ ఎం 1.91%, అల్ట్రాటెక్‌ 1.47%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.05%, టాటా మోటార్స్‌ 1.02%, హెచ్‌యూఎల్‌ 0.94% నీరసించాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.48% వరకు లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో వాహన 0.69%, కమొడిటీస్‌ 0.66%, యంత్ర పరికరాలు 0.43%, స్థిరాస్తి 0.33% నష్టపోయాయి. ఇంధన, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, టెక్‌ పెరిగాయి. బీఎస్‌ఈలో 1997 షేర్లు నష్టాల్లో ముగియగా, 1840 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 143 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

  • తగ్గిన పీ-నోట్‌ పెట్టుబడులు: భారత స్టాక్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్ల) ద్వారా వచ్చిన పెట్టుబడులు అక్టోబరులో రూ.1.26 లక్షల కోట్లకు తగ్గాయి. భారత ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో ఈ పెట్టుబడులు ఉన్నాయి. అంతకు ముందు వరుసగా 7 నెలల పాటు పీ-నోట్ల పెట్టుబడులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీ-నోట్ల పెట్టుబడులు రూ.88,398 కోట్లు కాగా, మార్చిలో రూ.88,600 కోట్లు, ఏప్రిల్‌లో రూ.95,911 కోట్లు, మేలో రూ.1.04 లక్షల కోట్లు, జూన్‌లో రూ.1.13 లక్షల కోట్లు, జులైలో రూ.1.23 లక్షల కోట్లు, ఆగస్టులో రూ.1.23 లక్షల కోట్లు, సెప్టెంబరులో రూ.1.33 లక్షల కోట్లుగా ఉన్నాయి. అక్టోబరులో కొంత తగ్గాయి.
  • పశ్చిమాసియాలో తమ హైడ్రోకార్బన్‌ విభాగం ‘మెగా’ ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. కంపెనీ రూ.10,000- 15,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టును మెగా ఆర్డర్లుగా పరిగణిస్తుంది.
  • ఆస్ట్రేలియా మార్కెట్‌కు కొత్త తరం క్లియరింగ్‌, సెటిల్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను అందించేందుకు ఆస్ట్రేలియా స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఏఎస్‌ఎక్స్‌తో టీసీఎస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
  • రిలయన్స్‌ క్యాపిటల్‌ బోర్డులో అయిదుగురు హిందుజా గ్రూప్‌ ప్రతినిధులను డైరెక్టర్లుగా నియమించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న రిలయన్స్‌ క్యాపిటల్‌ను కొనుగోలు చేయడానికి రూ.9,650 కోట్లతో అత్యధిక బిడ్డర్‌గా హిందుజా గ్రూప్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ నిలిచిన విషయం తెలిసిందే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని