2 కొత్త గనుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలు

ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌, త్వరలో రెండు కొత్త ఇనుప ఖనిజం గనులను ప్రారంభించబోతోంది.

Published : 21 Nov 2023 02:22 IST

ఈ ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం
ఆస్ట్రేలియాలో బంగారు గని ప్రారంభం
భవిష్యత్తు వ్యూహాలపై మెకెన్సీ అండ్‌ కంపెనీ, డెలాయిటీలతో అధ్యయనం
ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ్‌ ముఖర్జీ
ఈనాడు - హైదరాబాద్‌

ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌, త్వరలో రెండు కొత్త ఇనుప ఖనిజం గనులను ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఉన్న గనుల్లో అధికోత్పత్తి సాధించే అవకాశాలు ఉండటం, కొత్తగా 2 గనుల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నందున, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం లక్ష్యాన్ని చేరుకోవచ్చని సంస్థ ఆశిస్తోంది. కొత్త గనుల్లో బచేలి మైనింగ్‌ ప్రాజెక్టు ఒకటి. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ గని నుంచి అదనంగా 2 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయొచ్చని, కర్ణాటకలోని కుమారస్వామి గని నుంచి 2.2 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం లభిస్తుందని ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ సీఎండీ అమితవ్‌ ముఖర్జీ ‘కాన్ఫెరెన్స్‌ కాల్‌’లో మదుపరులకు ఇటీవల వెల్లడించారు. కుమారస్వామి గనికి వారం, పది రోజుల్లో అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ 2 కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైతే, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాబోదని తెలిపారు. కనీసం 47- 49 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధిస్తామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో  20 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని నమోదు చేయడాన్ని ప్రస్తావించారు.

రూ.2,000 కోట్ల వరకు పెట్టుబడి

అధికోత్పత్తి లక్ష్యాల సాధనకు పెద్దఎత్తున మూలధన పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. గనుల అభివృద్ధితో పాటు రవాణా, సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన యంత్ర సామగ్రి సమకూర్చుకోడానికి మూలధన పెట్టుబడి అవసరమని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల మూలధన పెట్టుబడి పెట్టాలనే లక్ష్యం ఉండగా, ఇప్పటికే రూ.1,000 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి రూ.1,800 - రూ.2,000 కోట్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదని వివరించారు. వచ్చే 3- 4 ఏళ్లలో ఏటా మూలధన పెట్టుబడి రూ.4,000- 5,000 కోట్లకు చేరుకుంటుందని అన్నారు. ఇనుప ఖనిజానికి దేశీయ మార్కెట్లో తక్కువ ధర లభించడం, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర పలుకుతూ ఉండటంపై స్పందిస్తూ, తమ వరకూ దేశీయ మార్కెట్లో విక్రయించడం వల్ల అధిక లాభాలు వస్తున్నాయని తెలిపారు. రవాణా ఛార్జీలు, పోర్టు ఛార్జీలు, పన్నులు కలుపుకొని లెక్కిస్తే, దేశీయ మార్కెట్లో ఇనుప ఖనిజం అమ్మకాలపై లాభాలు ఎక్కువగా ఉన్న విషయం స్పష్టమవుతుందని తెలిపారు.

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణపై..

ఎన్‌ఎండీసీ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు చాలా వరకూ కసరత్తు పూర్తయిందని అన్నారు. పెద్దసంఖ్యలో బిడ్లు దాఖలైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరుగుతున్నందున ఈ ప్రక్రియ నిలిచిపోయిందని, ఆ తర్వాత త్వరగానే పూర్తికావచ్చని అన్నారు. పూర్తి వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ఒక బంగారం గనిలో తవ్వకాలు మొదలుపెట్టినట్లు అమితవ్‌ ముఖర్జీ తెలిపారు. దీని నుంచి వచ్చే 12- 15 నెలల వ్యవధిలో ఒక టన్ను బంగారాన్ని ఉత్పత్తి చేయగలమన్నారు. ఇది చిన్నదే అయినప్పటికీ దాని పక్కనే 10 బంగారం గనులు ఉన్నాయని, వాటిని కూడా తీసుకుని, నిర్వహించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కేవలం ఇనుప ఖనిజం ఉత్పత్తికే పరిమితం కాకుండా అన్ని రకాల ఖనిజాల తవ్వకాన్ని చేపట్టాలనేది తమ ఉద్దేశమని అన్నారు. ఆస్ట్రేలియాలో అక్కడి ఒక కంపెనీ భాగస్వామ్యంతో లిథియమ్‌ గనుల్లో తవ్వకాలు చేపట్టాలనే ఆలోచన ఉందని తెలిపారు. వచ్చే ఆయిదారేళ్లలో ఇనుప ఖనిజం మార్కెట్‌ తీరుతెన్నులు, వినియోగదార్ల అవసరాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుని, దానికి తగ్గట్లుగా వ్యాపార వ్యూహాన్ని సిద్ధం చేసుకునే కసరత్తు మొదలు పెట్టామని అన్నారు. ఈ విషయంలో అగ్రశ్రేణి కన్సల్టెన్సీ సంస్థలైన మెకెన్సీ అండ్‌ కంపెనీ, డెలాయిటీలతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ సంస్థలకు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని