సంక్షిప్త వార్తలు

దేశీయ ప్రఖ్యాత స్నాక్స్‌ తయారీ, విక్రయ సంస్థ హల్దీరామ్స్, పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Published : 13 Jun 2024 02:11 IST

త్వరలో హల్దీరామ్స్‌ ఐపీఓ!

దిల్లీ: దేశీయ ప్రఖ్యాత స్నాక్స్‌ తయారీ, విక్రయ సంస్థ హల్దీరామ్స్, పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశ ఉత్తరాదిలో 1930 సంవత్సరాల్లో ఈ సంస్థను గంగాబిషన్‌ అగర్వాల్‌ ప్రారంభించారు. మిఠాయిలు, స్నాక్స్, ఫ్రోజన్‌ మీల్స్, బ్రెడ్లు వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడంతో పాటు విక్రయిస్తున్న ఈ సంస్థ, దిల్లీ చుట్టుపక్కల 43 రెస్టారెంట్లనూ నిర్వహిస్తోంది. దాదాపు 12 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 99,600 కోట్ల) విలువను సంస్థ ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ విలువ ప్రకారమే, సంస్థలో కొంత వాటాను ఐపీఓ ద్వారా విక్రయించి, భారీగా నిధులు సమీకరించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. నియంత్రిత వాటా కలిగిన పెట్టుబడిదార్ల నుంచి అనుమతులు రాగానే మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీకి దరఖాస్తు చేసే అవకాశం ఉందని సమాచారం.


అమెరికా వడ్డీ రేట్లు యథాతథమే

వాషింగ్టన్‌: మార్కెట్‌ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్, వరుసగా ఏడో సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25- 5.50 శాతం వద్దే కొనసాగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం స్థిరంగా 2 శాతం వైపునకు చలిస్తోందని గట్టి నమ్మకం కుదిరాకే, వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఫెడ్‌ స్పష్టం చేసింది.  అయితే ఈ ఏడాది ఒకసారి మాత్రమే వడ్డీరేట్ల కోతకు అవకాశం ఉందని సంకేతం ఇచ్చింది.


ఏప్రిల్‌లో యూకే వృద్ధి 0.4%

లండన్‌: బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌లో 0.4% వృద్ధి చెందిందని అధికారిక గణాంకాలు బుధవారం వెల్లడించాయి. జాతీయ గణాంక కార్యాలయం ప్రకటించిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌లో వినియోగదారు వ్యయాలు తగ్గినా, వృద్ధిరేటు మాత్రం మార్పు లేకుండా మార్చి స్థాయిలోనే 0.4 శాతంగా నమోదైంది.  మొదటి త్రైమాసిక వృద్ధి 0.6 శాతం కావడం గమనార్హం. ఒక నెలలో వృద్ధిరేటు గణాంకాలపై స్వల్పకాల అంశాలు ప్రభావం చూపుతాయి. జులై 4న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ వృద్ధినే ఆశావహంగా చెప్పుకుంటోంది. తాజా గణాంకాలు ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి ఆయుధంలా మారే  అవకాశం ఉందని భావిస్తున్నారు.


క్యాన్సర్‌ ఔషధం కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే సైక్లోఫాస్ఫమైడ్‌ ఇంజెక్షన్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, అమెరికాకు చెందిన ఇంజెనస్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎల్‌ఎల్‌సీతో డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఇంక్‌ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజెనస్‌ ఉత్పత్తి చేసిన ఈ ఔషధాన్ని అమెరికాలో డాక్టర్‌ రెడ్డీస్‌ విక్రయించనుంది. 500 ఎంజీ/2.5 ఎంఎల్, 1జీ/5ఎంఎల్, 2జీ/10ఎంఎల్‌ మోతాదుల్లో ఈ ఔషధం అందుబాటులో ఉంటుంది. వచ్చిన లాభాల్లో 50 శాతాన్ని ఇంజెనస్‌కు చెల్లించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.


హైదరాబాద్‌లో ఒలింపస్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ మెడ్‌టెక్‌ సంస్థ ఒలింపస్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌లో తన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికోసం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదర్చుకుంది. ఒలింపస్‌ ఆవిష్కరణలకు తోడ్పాటు అందించేలా హెచ్‌సీఎల్‌ టెక్‌ ఇక్కడ ఒక ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఓడీసీ)ని ఏర్పాటు చేస్తుంది. అధునాతన ఇంజినీరింగ్‌ సాంకేతికత ద్వారా రోగులకు అందుబాటు ధరలో చికిత్స అందించే కృత్రిమ మేధ ఆవిష్కరణల కోసమే ఈ కేంద్రాన్ని ఉద్దేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరుల సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద వైద్య పరికరాల సంస్థ తన పరిశోధనా కేంద్రం కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆర్యోగ సంరక్షణ రంగానికి హైదరాబాద్, అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. ఒలింపస్‌ కేంద్రం దేశంలో వైద్య పరికరాల రంగంలో కీలకంగా మారనుందని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన బయోఏషియా సదస్సు సందర్భంగా దేశంలో అడుగు పెట్టేందుకు ఒలింపస్‌ తెలంగాణను ఎంచుకుందని పేర్కొన్నారు. ఓడీసీ ఏర్పాటుతో పాటు ఒలింపస్‌ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్‌తో కలిసి ఉమ్మడి పరిశోధనలూ చేసేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రోగుల అవసరాలకు తగిన వైద్య పరికరాలను రూపొందించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని