వ్యాపార మద్దతు విధానాలు అవలంబించాలి

ప్రధాని మోదీ ప్రభుత్వం చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, ఉద్యోగాల సృష్టిని మరింత ప్రోత్సహించడానికి అనువైన విధానాన్ని అనుసరించాలని పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్‌పర్సన్‌ సంజీవ్‌ క్రిషన్‌ సూచించారు.

Published : 13 Jun 2024 02:12 IST

పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్‌పర్సన్‌ సంజీవ్‌ క్రిషన్‌ 

దిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, ఉద్యోగాల సృష్టిని మరింత ప్రోత్సహించడానికి అనువైన విధానాన్ని అనుసరించాలని పీడబ్ల్యూసీ ఇండియా ఛైర్‌పర్సన్‌ సంజీవ్‌ క్రిషన్‌ సూచించారు. ఇందుకోసం గ్రాన్యులర్‌ పద్ధతి (ఒక అంశాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజించి, సమగ్రంగా అన్నింటిపై దృష్టి సారించడం) పాటించాలని తెలిపారు. ప్రధాన రంగాలకు సంబంధించి, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందించడం, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులపై మరింత దృష్టి కేంద్రీకరించడం ప్రభుత్వ ప్రాధాన్యతలుగా ఉండాలని తెలిపారు. సమ్మిళిత వృద్ధి సాధించడానికి ఉద్యోగాల కల్పన, ఉత్పాదకత మెరుగుదలకు   ప్రాధాన్యమివ్వాలని ఆకాంక్షించారు. గత దశాబ్ద కాలంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, రుణ లభ్యతతో పాటు సులభతర వ్యాపార నిర్వహణ విధానాలు సమకూరాయని వెల్లడించారు. వీటిని తదుపరి దశకు తీసుకెళ్లి, పెరుగుతున్న వాణిజ్యానికి మద్దతు ఇవ్వడం ద్వారా, అధిక ఉద్యోగాల కల్పన జరిగేలా చూడాలని, ఉత్పాదకతను పెంచడమూ అంతే అవసరమని పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలతో పాటు నియంత్రణ సంస్థల మద్దతు, ప్రోత్సాహకాల అందజేత వంటివి వినూత్నతను ముందుకు నడిపించడానికి దోహదం చేస్తాయని వివరించారు. ప్రభుత్వం/ప్రైవేటు సంస్థలు నిర్వహించగలిగే పరిశోధనా కేంద్రాలను ప్రోత్సహించడం వల్ల ప్రవేశ అడ్డంకులు తగ్గుతాయని, తద్వారా అంకురాలకు ప్రోత్సాహాన్ని అందించవచ్చని క్రిషన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని