ఒడుదొడుకులున్నా ముందుకే

రెండు రోజుల విరామం తర్వాత సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. విద్యుత్, యంత్ర పరికరాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాన్ని తాకింది.

Published : 13 Jun 2024 02:16 IST

సమీక్ష
మదుపర్ల సంపద రూ.429 లక్షల కోట్లకు

రెండు రోజుల విరామం తర్వాత సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. విద్యుత్, యంత్ర పరికరాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ జీవనకాల తాజా గరిష్ఠాన్ని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి పెద్ద షేర్లు రాణించడం సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 83.48 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.16% లాభంతో 82.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై లాభపడగా, టోక్యో, హాంకాంగ్‌ నష్టపోయాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సూచీల జోరుతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.429.32 లక్షల కోట్ల (దాదాపు 5.14 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. 

సెన్సెక్స్‌ ఉదయం 76,679.11 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం అదే జోరు కొనసాగించిన సూచీ, ఇంట్రాడేలో 594 పాయింట్లు లాభపడి 77,050.53 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో అమ్మకాలు రావడంతో 149.98 పాయింట్ల లాభంతో 76,606.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 58.10 పాయింట్లు పెరిగి 23,322.95 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,441.95 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ 2.54%, టెక్‌ మహీంద్రా 1.56%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.19%, అల్ట్రాటెక్‌ 1.08%, ఎన్‌టీపీసీ 1.02%, ఎల్‌ అండ్‌ టీ 0.81%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.58%, రిలయన్స్‌ 0.43% రాణించాయి. ఎం అండ్‌ ఎం    1.62%, హెచ్‌యూఎల్‌ 1.03%, టైటన్‌ 0.80%, ఇన్ఫోసిస్‌ 0.71%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.54% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. పరిశ్రమలు, విద్యుత్, యంత్ర పరికరాలు, ఇంధన, కమొడిటీస్, ఆరోగ్య సంరక్షణ, లోహ మెరిశాయి. స్థిరాస్తి, ఎఫ్‌ఎమ్‌సీజీ పడ్డాయి. బీఎస్‌ఈలో 2518 షేర్లు లాభపడగా, 1376 స్క్రిప్‌లు నష్టపోయాయి. 97 షేర్లలో ఎటువంటి మార్పులేదు.

  • గో ఫస్ట్‌ దివాలా ప్రక్రియకు గడువు పొడిగింపు: గో ఫస్ట్‌ దివాలా పరిష్కార ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్‌సీఎల్‌టీ దిల్లీ బెంచ్‌ అదనంగా మరో 60 రోజుల సమయం ఇచ్చింది. ఈ గడువు పొడిగించడం ఇది నాలుగోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న 60 రోజుల పొడిగింపు ఇవ్వగా, అది ఈనెల 3తో ముగిసింది. అందుకే మళ్లీ పొడిగించారు. తాజా గడువులోగా దివాలా ప్రక్రియ పూర్తి చేయాలని రిజొల్యూషన్‌ ప్రొఫెషనల్, గో ఫస్ట్‌ రుణదాతల కమిటీని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. 
  • ప్రపంచంలో అత్యంత విలువైన 100 బ్రాండ్‌లలో ఇన్ఫోసిస్‌ చోటు దక్కించుకుంది. కాంటార్‌ విడుదల చేసిన అత్యంత విలువైన బ్రాండ్‌ల నివేదికలో ఇన్ఫోసిస్‌ 74వ స్థానంలో నిలిచింది. 
  • అస్సోంలోని గువాహటిలో అధునాతన లేబొరేటరీ వసతులతో సెంట్రలైజ్డ్‌ కోర్‌ రెపోసిటరీ నిర్మించేందుకు ఆయిల్‌ ఇండియా నుంచి రూ.100 కోట్ల కాంట్రాక్ట్‌ అందుకున్నట్లు ప్రభుత్వరంగ నిర్మాణ సంస్థ ఎన్‌బీసీసీ వెల్లడించింది.
  • పశ్చిమ బెంగాల్‌లో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ పోర్ట్‌ అథారిటీ నుంచి రూ.2015.88 కోట్ల ఆర్డరును డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అందుకుంది. 
  • కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సతీశ్‌ నారాయణ్‌ జాజు నియమితులయ్యారు. తక్షణమే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. జులై 9న కంపెనీ 105వ ఏజీఎంకు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.
  • పైపింగ్‌ సొల్యూషన్స్‌ అందించే డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.193-203 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.418 కోట్లు సమీకరించనుంది. యాంకర్‌ మదుపర్లు జూన్‌ 18న బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్‌ మదుపర్లు కనీసం 73 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
  • ఇక్సిగో ఐపీఓ ముగిసేసరికి 98.10 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 4,37,69,494 షేర్లను ఆఫర్‌ చేయగా, 4,29,36,34,618 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీల నుంచి 106.73 రెట్లు, ఎన్‌ఐఐ విభాగంలో 110.25 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి   53.95 రెట్ల స్పందన నమోదైంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని