మూడో త్రైమాసికం నుంచి వడ్డీ రేట్లు తగ్గుతాయి

డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, మధ్యస్థ కాలంలో ఇవి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా వెల్లడించారు.

Published : 13 Jun 2024 02:17 IST

ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా

దిల్లీ: డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, మధ్యస్థ కాలంలో ఇవి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను సడలించడం ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనూ ఆర్‌బీఐ రెపో రేటును మార్చలేదు. వడ్డీరేట్లు యథాతథంగా ఉంచాలని, వరుసగా   8వ ద్వైమాసిక సమీక్షలోనూ నిర్ణయించడం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ, బలమైన ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. ‘అక్టోబరు నుంచి ద్రవ్యోల్బణం 4 శాతానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని, అందువల్ల వడ్డీ రేట్లను తగ్గించేందుకు అది సరైన సమయం అని భావిస్తున్నట్లు’ దినేశ్‌ ఖారా పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో వడ్డీ రేట్లు దాదాపు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో కొన్ని స్వల్ప మార్పులను చూస్తామని, అది మధ్యకాలికంగా వడ్డీ రేట్లు తగ్గే ధోరణి కావచ్చని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని