ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో రూ.3-4 లక్షల కోట్ల పెట్టుబడులు

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం వచ్చే నాలుగేళ్లలో రూ.3-4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించే అవకాశం ఉందని ఇక్రా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ రేటింగ్స్‌ అధికారి కె.రవిచంద్రన్‌ అంచనా వేశారు.

Published : 13 Jun 2024 02:19 IST

2 లక్షల ఉద్యోగాల సృష్టి
ప్రైవేటు రంగంలో మూలధన వ్యయాలు పుంజుకుంటాయ్‌: ఇక్రా

దిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం వచ్చే నాలుగేళ్లలో రూ.3-4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించే అవకాశం ఉందని ఇక్రా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ రేటింగ్స్‌ అధికారి కె.రవిచంద్రన్‌ అంచనా వేశారు. తద్వారా 2 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. సెమీ కండక్టర్, సౌర మాడ్యూల్, ఫార్మాస్యూటికల్‌ ఇంటర్మీడియరీస్‌ రంగాల్లోని పెద్ద ప్రాజెక్టులు ఈ పథకం కింద కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని తెలిపారు. చమురు-గ్యాస్, లోహాలు, గనులు, ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ, సిమెంట్‌ రంగాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడులు పుంజుకుంటాయని వివరించారు. ఈ రంగాల్లో పెట్టుబడులను రికార్డు గరిష్ఠాలకు చేర్చాలంటే, ప్రభుత్వం కొన్ని పన్ను రాయితీలను అందించాలని సూచించారు. అప్పుడే ప్రజల చేతుల్లో మిగులు నిధులు ఉంటాయని తెలిపారు.

2021లో 14 రంగాల కోసం ప్రభుత్వం పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించింది. టెలికమ్యూనికేషన్, మన్నికైన వినిమయ పరికరాలు, టెక్స్‌టైల్స్, వైద్య పరికరాల తయారీ, స్పెషాల్టీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సౌర పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ బ్యాటరీలు, డ్రోన్లు, ఔషధ రంగాలకు వివిధ పీఎల్‌ఐ పథకాలున్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు మొత్తం రూ.1.97 లక్షల కోట్లను ప్రభుత్వం ప్రకటించింది. 2023 నవంబరు వరకు పీఎల్‌ఐ పథకాల్లోకి రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. ఫలితంగా సుమారు 6.78 లక్షల ఉద్యోగాలు లభించాయని అంచనా. వచ్చే నాలుగేళ్లలో రూ.3-4 లక్షల కోట్ల అదనపు పెట్టుబడులు, 2 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని