3 నెలల కనిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి

దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి, ఏప్రిల్‌లో 5 శాతంగా నమోదైంది. ఇది 3 నెలల కనిష్ఠ స్థాయి.  తయారీ రంగం నిరుత్సాహపరచడమే దీనికి కారణం.

Updated : 13 Jun 2024 06:46 IST

ఏప్రిల్‌లో 5%

దిల్లీ: దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి, ఏప్రిల్‌లో 5 శాతంగా నమోదైంది. ఇది 3 నెలల కనిష్ఠ స్థాయి.  తయారీ రంగం నిరుత్సాహపరచడమే దీనికి కారణం. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధిని లెక్కిస్తారు. 2024 జనవరిలో ఇది 4.2 శాతంగా, ఫిబ్రవరిలో 5.6%, మార్చిలో 5.4 శాతంగా నమోదైంది. 2023 ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 4.6 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే తాజా గణాంకాలు మెరుగ్గానే ఉన్నా, ఈ ఏడాదిలో ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే తక్కువగా నమోదైంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ప్రకారం..

  • ఈ ఏడాది ఏప్రిల్‌లో తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి 3.8 శాతంగా ఉంది. 2023 ఏప్రిల్‌లోని 5.5 శాతంతో పోలిస్తే తగ్గింది. విద్యుదుత్పత్తి వృద్ధి -1.1% నుంచి 10.2 శాతానికి పెరిగింది. గనుల ఉత్పత్తి వృద్ధి 5.1% నుంచి 6.7 శాతానికి చేరింది. 
  • 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తంమీద పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.9 శాతంగా నమోదైంది. 2022-23లో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ.

ఏడాది కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

దేశీయంగా కొన్ని ఆహార ధరలు స్వల్పంగా తగ్గడంతో, ఈ ఏడాది మేలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.75 శాతంగా నమోదైంది. ఏడాది కనిష్ఠ స్థాయి ఇది. ఇంతకు ముందు 2023 మేలో నమోదైన 4.31 శాతమే తక్కువగా ఉంది. వినియోగదారు ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 4.83 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 8.70 శాతంగా ఉండగా, మేలో 8.69 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద (2% ఎక్కువ లేదా తక్కువగా) ఉంచాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. 

మేలో పండ్ల ధరలతో పోలిస్తే కూరగాయల ధరలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సగటు ద్రవ్యోల్బణం 5.28 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతంగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని