సంక్షిప్త వార్తలు (6)

దేశంలో ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు భూమి, కార్మిక, వ్యవసాయ సంస్కరణలపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది.

Published : 14 Jun 2024 02:03 IST

భూ, కార్మిక, వ్యవసాయ సంస్కరణలపై దృష్టిపెట్టాలి 
మోదీ ప్రభుత్వానికి సీఐఐ సూచన

దిల్లీ: దేశంలో ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు భూమి, కార్మిక, వ్యవసాయ సంస్కరణలపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న  విధానపరమైన నిర్ణయాలతో, ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితికి చేరుకుందని సీఐఐ అధ్యక్షుడు సంజీవ్‌ పురి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 8 శాతానికి చేరడానికి సిద్ధంగా ఉందని, వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరంలోనూ 7% కంటే ఎక్కువ వృద్ధి సాధించనున్నామని తెలిపారు. ‘వృద్ధి అంచనాలను అందుకోవడానికి, అసంపూర్తిగా ఉన్న సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎగుమతుల ద్వారా ప్రపంచ వాణిజ్య అవకాశాలను మెరుగుపరుచుకోవాలి. సాధారణ వర్షపాత అంచనాలతో ఈ ఏడాది పెట్టుబడులు, వినియోగం రాణిస్తాయి’ అని సంజీవ్‌ పురి అన్నారు. వచ్చే ఏడాది కాలంలో వ్యవసాయం, సేవలు, పరిశ్రమల రంగాలు దూసుకెళ్లే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ రంగ పెట్టుబడులపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అన్ని రంగాల్లో పెట్టుబడులు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ఒకదశలో జీడీపీలో 20.7 శాతానికి క్షీణించిన ప్రైవేట్‌ పెట్టుబడులు.. ప్రస్తుతం కొవిడ్‌ మునుపటి స్థాయి 23.8 శాతానికి చేరినట్లు వివరించారు. గ్రామీణ గిరాకీపైనా మంచి ఆశలు ఉన్నాయని వెల్లడించారు. పెట్రోలియం ఉత్పత్తులు, స్థిరాస్తి వంటి వాటిని జీఎస్‌టీలోకి చేర్చాలని, ఆతిథ్య రంగానికి మౌలిక రంగ హోదా ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.  


డీఎల్‌ఐ పథకానికి మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ 

 స్మార్ట్‌ ఎనర్జీ మీటర్లలో వినియోగించే ఐసీలను ఆవిష్కరించే ప్రాజెక్టుకు నిధులు

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ పథకమైన సెమీకండక్టర్‌ డిజైన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (డీఎల్‌ఐ) పథకానికి హైదరాబాద్‌ కు చెందిన మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ఎంపికైంది. ఈ పథకం కింద స్మార్ట్‌ ఎనర్జీ మీటర్లలో వినియోగించే ఐసీ (ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌)లను అభివృద్ధి చేయడానికి మాస్‌చిప్‌ చేసిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఆమోదించింది. ఫలితంగా సెమీకండక్టర్‌ డిజైన్‌ సేవల విభాగంలో విస్తరించడానికి అవసరమైన ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి మాస్‌చిప్‌నకు లభిస్తుంది. ఐసీలు, చిప్‌సెట్‌లు, సిస్టమ్‌ ఆన్‌ చిప్స్‌ (ఎస్‌ఓసీస్‌), సిస్టమ్స్‌ అండ్‌ ఐపీ కోర్స్‌ అండ్‌ సెమీకండక్టర్‌ లింక్డ్‌ డిజైన్స్‌లో పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలు సాగించటానికి అయిదేళ్ల పాటు నిధులు అందుతాయి. ఐసీలను డిజైన్‌ చేసి, మనదేశంతో పాటు విదేశాలకు సరఫరా చేయాలన్నది మాస్‌చిప్‌ ప్రణాళిక. స్మార్ట్‌ ఎనర్జీ మీటర్ల ఐసీల మార్కెట్‌ ఏటా 7% వృద్ధి సాధిస్తోందని, 2028 నాటికి మనదేశంలో 6 కోట్ల ఐసీలకు, ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూనిట్లకు డిమాండ్‌ ఉంటుందన్నది అంచనా. 

మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ సీఈఓ, ఎండీ శ్రీనివాసరావు కాకుమాను స్పందిస్తూ దేశీయ కంపెనీలు ఐపీ కోర్, ఎస్‌ఓసీస్, సిస్టమ్స్, సెమీకండక్టర్‌ ఉత్పత్తులు ఆవిష్కరించి, ప్రపంచ మార్కెట్లో ఇతర సంస్థలతో పోటీపడటానికి కేంద్ర ప్రభుత్వ డీఎల్‌ఐ పథకం దోహదపడుతుందని అన్నారు. ఐసీలపై తాము సాధించే ప్రగతిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలించి, నిధులు విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. 


నోకియా, ఎరిక్‌సన్‌ కంపెనీలకు రూ.2,458 కోట్ల వొడాఫోన్‌ ఐడియా షేర్లు

దిల్లీ: బకాయిల చెల్లింపులో భాగంగా కీలక వెండర్లు నోకియా ఇండియా, ఎరిక్‌సన్‌ ఇండియాలకు రూ.2,458 కోట్ల విలువైన షేర్లు కేటాయించనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా స్టాక్‌ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కంపెనీ ఫాలో ఆన్‌ ఆఫర్‌ ధరతో పోలిస్తే దాదాపు 35% అధిక ధర (రూ.14.80)కు ఈ షేర్లను ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో కేటాయించేందుకు వొడాఫోన్‌ ఐడియా బోర్డు ఆమోదం తెలిపింది. నోకియాకు రూ.1520 కోట్లు, ఎరిక్‌సన్‌కు రూ.938 కోట్ల విలువైన షేర్లు లభిస్తాయి. వీటికి 6 నెలల లాకిన్‌ కాలవ్యవధి ఉంటుంది. ఈ షేర్ల కేటాయింపునకు జులై 10న జరిగే కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో వాటాదార్లు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ తర్వాత కంపెనీలో నోకియాకు 1.5%, ఎరిక్‌సన్‌కు    0.9% వాటా ఉండనుంది. కంపెనీ ప్రమోటర్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌ వాటా 37.3 శాతానికి, వొడాఫోన్‌ వాటా 23.2 శాతానికి తగ్గుతుంది


పంచ్, నెక్సాన్‌ ఈవీలకు భారత్‌ ఎన్‌క్యాప్‌ 5 స్టార్‌ రేటింగ్‌

దిల్లీ: విద్యుత్‌ కార్ల (ఈవీ) భద్రత కోసం తీసుకొచ్చిన భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (భారత్‌ ఎన్‌క్యాప్‌) ప్రమాణాల కింద, 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి ఈవీ కార్లుగా టాటా మోటార్స్‌కు చెందిన పంచ్‌.ఈవీ, నెక్సాన్‌.ఈవీ నిలిచాయి. ‘దేశీయ విపణిలో తొలి 5 స్టార్‌ రేటెడ్‌ విద్యుత్తు కార్లుగా పంచ్, నెక్సాన్‌ నిలిచినందుకు టాటా మోటార్స్‌కు అభినందనలు’ అని రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ‘భారత రవాణా వ్యవస్థలో భవిష్యత్తు విద్యుత్తు వాహనాలదే. భారత్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్‌ వల్ల వినియోగదార్లు భద్రమైన కార్లను ఎంచుకోవడానికి వీలవుతుంద’ని ఆయన వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌-ఎన్‌క్యాప్‌ వాహన రేటింగ్‌ వ్యవస్థను ఆవిష్కరించారు.


 బైజూస్‌ బ్రాండ్‌పై ఎడ్యటెక్‌ సేవలందించే థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రస్తుత రైట్స్‌ ఇష్యూ ప్రక్రియను నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) నిలిపేసింది. మొదటి విడత రైట్స్‌ ఇష్యూలో భాగంగా మార్చి 2న షేర్లను కేటాయించడానికి ముందు, తర్వాత ఉన్న వాటాదార్ల వివరాలు సమర్పించాలని ఆదేశించింది.


 ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌లో మొత్తంగా 26.72 కోట్ల షేర్లను తన మూడు అనుబంధ సంస్థల ద్వారా రూ.5,884 కోట్లకు సింగపూర్‌కు చెందిన వెల్త్‌ ఫండ్‌ జీఐసీ విక్రయించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని