శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు స్పెక్ట్రమ్‌ కోరిన జియో

శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల ప్రయోగాత్మక పరీక్షల కోసం స్పెక్ట్రమ్‌ కావాలంటూ టెలికాం విభాగాన్ని (డాట్‌) జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ కోరింది.

Published : 14 Jun 2024 02:04 IST

దిల్లీ: శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల ప్రయోగాత్మక పరీక్షల కోసం స్పెక్ట్రమ్‌ కావాలంటూ టెలికాం విభాగాన్ని (డాట్‌) జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ కోరింది. ఇప్పటికే ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌(ఇన్‌-స్పేస్‌) నుంచి అనుమతి లభించడం ఇందుకు నేపథ్యం.   శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవల లైసెన్సు జీఎమ్‌పీసీఎస్, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ లైసెన్సును జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌కు డాట్‌ గతంలోనే ఇచ్చింది. ‘గత నెలలోనే ప్రయోగాత్మక పరీక్షల కోసం స్పెక్ట్రమ్‌ను జియో కోరింది. ఒక్కసారి ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను ఇస్తే, వాణిజ్య సేవలను కంపెనీ ప్రారంభించగలద’ని ఆ వర్గాలు పేర్కొన్నారు. లగ్జెంబర్గ్‌కు చెందిన ఎస్‌ఈఎస్‌తో కలిసి శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవల కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసింది. భారతీ గ్రూప్‌ మద్దతు ఉ్న యూటెల్‌శాట్‌ ఒన్‌వెబ్‌కు కూడా అన్ని అనుమతులు దక్కగా.. మార్చిలోనే ప్రయోగాత్మక స్పెక్ట్రమ్‌ను కేంద్రం జారీ చేసింది. 

మెర్సిడెస్‌ బెంజ్‌ రూ.3,000 కోట్ల పెట్టుబడులు

ముంబయి: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్, మహారాష్ట్రలో రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆ రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ గురువారం వెల్లడించారు. జర్మనీ పర్యటనలో భాగంగా మెర్సిడెస్‌ బెంజ్‌ ఉన్నతాధికారులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో సదరు సంస్థ మహారాష్ట్రలో ఈ ఏడాది రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందని వివరించారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు పెద్ద సంస్థల పారిశ్రామిక ప్రాజెక్టులు తరలిపోతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తున్న సమయంలో, శివసేన-భాజపా-ఎన్‌సీపీ ప్రభుత్వానికి ఇది ఊరట కలిగించే అంశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని