సంక్షిప్తవార్తలు(5)

పెన్నా సిమెంట్‌కు ఉన్న రూ.3,000 కోట్ల రుణాలను తాము తీర్చేస్తామని అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని అంబుజా సిమెంట్స్‌ వెల్లడించింది. పెన్నా సిమెంట్‌ను రూ.10,422 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు అంబుజా తాజాగా వెల్లడించిన విషయం విదితమే.

Published : 15 Jun 2024 02:36 IST

పెన్నా అప్పు తీర్చేస్తాం: అంబుజా సిమెంట్స్‌

ముంబయి: పెన్నా సిమెంట్‌కు ఉన్న రూ.3,000 కోట్ల రుణాలను తాము తీర్చేస్తామని అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని అంబుజా సిమెంట్స్‌ వెల్లడించింది. పెన్నా సిమెంట్‌ను రూ.10,422 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు అంబుజా తాజాగా వెల్లడించిన విషయం విదితమే. ఈ లావాదేవీ మరో 3-4 నెలల్లో పూర్తి అవుతుందని, ఆ తర్వాత పెన్నాకు ఉన్న రుణాన్ని చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంబుజా వద్ద ఉన్న మిగులు నిల్వలు రూ.15,676 కోట్లలో నుంచి ఈ మొత్తాన్ని కేటాయించే అవకాశం ఉంది. పెన్నా రుణంపై వడ్డీ వ్యయాలను తగ్గించడంతో పాటు, క్రెడిట్‌ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘ఏఏఏ’గా మార్చేందుకు ఇది ఉపకరిస్తుందని అంబుజా భావిస్తోంది. దీంతోపాటు పెన్నాకున్న 14 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 3 మిలియన్‌ టన్నులు పెంచనున్నట్లు అంబుజా వెల్లడించింది. 


ఇండస్‌ టవర్స్‌లో వాటా విక్రయించనున్న వొడాఫోన్‌

ముంబయి: భారత్‌లోని ఇండస్‌ టవర్స్‌లో తనకున్న పూర్తి వాటాను విక్రయించే యోచనలో వొడాఫోన్‌ గ్రూపు ఉంది. వచ్చే వారం స్టాక్‌ మార్కెట్‌లో బ్లాక్‌ డీల్‌ ద్వారా ఈ విక్రయ లావాదేవీని నిర్వహించనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తనకున్న అప్పులో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ఈ నిధులను ఉపయోగించాలని వొడాఫోన్‌ గ్రూపు భావిస్తోందని తెలిపాయి. మొబైల్‌ టవర్ల నిర్వహణ సంస్థ అయిన ఇండస్‌ టవర్స్‌లో వొడాఫోన్‌ గ్రూపునకు వివిధ అనుబంధ సంస్థల ద్వారా 21.5 శాతం వాటా ఉంది. శుక్రవారం షేరు ముగింపు ధర ప్రకారం ఈ వాటా విలువ 2.3 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.19,000 కోట్లు) అంచనా వేస్తున్నారు. అయితే ఈ  21.5 శాతం వాటాలో ఎంత విక్రయించాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయానికి వొడాఫోన్‌ గ్రూపు రాలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ పరిణామాలపై వొడాఫోన్‌ ఐడియా, వొడాఫోన్, ఇండస్‌ టవర్స్‌లు స్పందించేందుకు నిరాకరించాయి. 


అదానీ గ్రూపు నుంచి బీహెచ్‌ఈఎల్‌కు రూ.7,000 కోట్ల ఆర్డర్లు

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌)కు అదానీ గ్రూపు భారీ ఆర్డరును ఇచ్చింది. రెండు విద్యుత్‌ కేంద్రాల కోసం రూ.7,000 కోట్ల విలువైన పనులను అప్పగించింది. 2×800 సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ఒకటి రాయపూర్, మరోటి మిర్జాపూర్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ రెండు కేంద్రాలకు సంబంధించిన ఆర్డర్లను అదానీ గ్రూపు అనుబంధ సంస్థ ఎంటీఈయూపీపీఎల్‌ నుంచి అందుకున్నట్లు బీహెచ్‌ఈఎల్‌ తెలిపింది. ఇందులో భాగంగా బీహెచ్‌ఈఎల్‌ ఈ రెండు ప్రాజెక్టులకూ అవసరమైన పరికరాలను అందించడంతోపాటు, నిర్మాణం, ప్రారంభం వరకూ అవసరమైన సేవలను అందిస్తుంది. 


హ్యుందాయ్‌ అయానిక్‌-5 కార్ల రీకాల్‌

దిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా 1,744 అయానిక్‌-5 కార్లను వెనక్కి పిలిపిస్తోంది. జులై 21, 2022 నుంచి ఏప్రిల్‌ 30, 2024 మధ్య తయారైన ఈ విద్యుత్‌ మోడల్‌ కార్లను కంపెనీ రీకాల్‌ చేస్తున్నట్లు భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) వెబ్‌సైట్‌లోని సమాచారం చెబుతోంది. ఇంటిగ్రేటెడ్‌ ఛార్జింగ్‌ కంట్రోల్‌ యూనిట్‌తో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల 12వీ బ్యాటరీ డిస్‌ఛార్జి కావొచ్చని అంటోంది. ఈ విషయంపై హ్యుందాయ్‌ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ రీకాల్‌ ప్రక్రియలో కార్ల యజమానులతో సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. అయానిక్‌ 5 ప్రారంభ ధర రూ.46.05 లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది. 


రికార్డు గరిష్ఠానికి ఫారెక్స్‌ నిల్వలు

దిల్లీ: జూన్‌ 7తో ముగిసిన వారానికి దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 4.307 బి.డాలర్లు (దాదాపు రూ.35,800 కోట్లు) పెరిగి జీవనకాల గరిష్ఠమైన 655.817 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.54.43 లక్షల కోట్లు)కు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పేర్కొంది. అంతక్రితం వారం ఫారెక్స్‌ నిల్వలు 651.51 బి.డాలర్లుగా ఉన్నాయి. సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 3.773 బి.డాలర్లు అధికమై 576.337 బి.డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 481 మి.డాలర్లు పెరిగి 56.982 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌లు) 43 మిలియన్‌ డాలర్లు వృద్ధితో 18.161 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థానం 10 మిలియన్‌ డాలర్లు పెరిగి 4.336 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని