భారత్‌ అధిక వృద్ధికి ఆ 3 ‘ప్రతికూలతలే’ అడ్డంకి

భారత్‌ వేగంగా వృద్ధి చెందేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రపంచీకరణ నెమ్మదించడం, ప్రపంచ రాజకీయాల్లో విభజన, వాతావరణంలో మార్పుల రూపంలో మూడు ‘ప్రతికూలతల’ను అధిగమించాల్సిన అవసరం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు.

Published : 15 Jun 2024 02:43 IST

సీఈఏ వి.అనంత నాగేశ్వరన్‌

ముంబయి: భారత్‌ వేగంగా వృద్ధి చెందేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రపంచీకరణ నెమ్మదించడం, ప్రపంచ రాజకీయాల్లో విభజన, వాతావరణంలో మార్పుల రూపంలో మూడు ‘ప్రతికూలతల’ను అధిగమించాల్సిన అవసరం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు. 1980- 2015 మధ్య చైనా సుమారు రెండంకెల వృద్ధిని నమోదు చేసిన సమయంలో ఇలాంటి ప్రతికూలతలు ఆ దేశానికి ఎదురుకాలేదని వాహన డీలర్ల సమాఖ్య (ఫాడా) సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం భారత్‌ అధిక వృద్ధి రేటును నమోదు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అధిక వృద్ధి సాధనకు పై మూడు అంశాలు భారత్‌కు అవరోధంగా నిలుస్తాయ’ని నాగేశ్వరన్‌ వివరించారు. 1980 నుంచి 2015 మధ్య ప్రపంచీకరణ వేగంగా జరుగుతుండటం, ప్రపంచ రాజకీయాల్లో విభజన కాకుండా ఏకీకరణ కావడం, ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడున్న స్థాయిలో వైరుధ్యాలు లేకపోవడం లాంటివి చైనాకు కలిసొచ్చాయని తెలిపారు. విద్యుత్‌ వాహనాల తయారీ కోసం చైనా నుంచి లోహాలు, ఖనిజాల దిగుమతులపై దేశీయ వాహన పరిశ్రమ ఆధారపడటం పెరుగుతోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం భారత్‌- చైనాల మధ్య బంధం సరిగ్గా లేదనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలని తెలిపారు. ముడి చమురు దిగుమతుల కోసం అరబ్‌ దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని అనుకోవడం మంచి ఉద్దేశమే కానీ.. వీటి స్థానంలో భారత్‌తో సరిగ్గా సత్సంబంధాలు లేని మరో దేశాన్ని తీసుకొని రావడం సరికాదు కదా అని వివరించారు. కానీ చైనా నుంచి విద్యుత్‌ వాహన విడిభాగాల దిగుమతులపై ఆధారపడటాన్ని పర్యావరణ కోణంలో డీలర్లు చూడాలని.. ఆ ప్రకారమే వినియోగదార్లకు సూచనలు చేయాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని