15 నెలల గరిష్ఠానికి టోకు ధరలు

మే నెలలో టోకు ధరలు 15 నెలల గరిష్ఠానికి చేరాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. తయారీ ఉత్పత్తులు ప్రియం కావడం కూడా మరో కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Updated : 15 Jun 2024 04:42 IST

2.61 శాతానికి మే నెల డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం

దిల్లీ: మే నెలలో టోకు ధరలు 15 నెలల గరిష్ఠానికి చేరాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. తయారీ ఉత్పత్తులు ప్రియం కావడం కూడా మరో కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మే నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2.61 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరిలో నమోదైన 3.85 శాతం తర్వాత ఇదే అత్యధికం. అంతేకాకుండా వరుసగా మూడు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుండటం గమనార్హం. ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ 1.26 శాతం వద్ద ఉండగా.. 2023 మేలో ఇది -3.61 శాతంగా నమోదైంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మేలో 10 నెలల గరిష్ఠమైన 9.82 శాతానికి  చేరింది. కూరగాయల ద్రవ్యోల్బణ రేటు 23.60 శాతం నుంచి 32.42 శాతానికి పెరిగింది. ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం వరుసగా 58.05%, 64.05%, 21.95 శాతంగా నమోదైంది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రేటు -0.42 శాతం నుంచి 0.78 శాతానికి పెరిగింది. అయితే ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణ రేటు 1.38 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 1.35 శాతానికి పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని