సంక్షిప్త వార్తలు(7)

ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్‌) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్‌ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్‌ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్‌ అంచనా.

Updated : 16 Jun 2024 06:47 IST

ఒపెక్‌ ఇంధన గిరాకీ అంచనాల్లో మార్పుల్లేవ్‌

దిల్లీ: ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్‌) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్‌ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్‌ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్‌ అంచనా. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అంచనాల కంటే ముడిచమురు వినియోగం తగ్గినా కూడా, ఒపెక్‌ తన అంచనాలు సవరించకపోవడం గమనార్హం. పర్యటనలు, పర్యాటకం వల్ల ఈ ఏడాది ద్వితీయార్ధంలో చమురు వినియోగం అధికమవుతుందని సమాఖ్య పేర్కొంది. పర్యాటకం వల్లే, చమురుకు గిరాకీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో రోజుకు    2.3 మిలియన్‌ బ్యారెళ్లు అధికమవుతుందని అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా సేవల రంగం స్థిర వృద్ధితో సాగుతోందని ఒపెక్‌ వివరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి చమురు వినియోగ అంచనాలను రోజుకు 50,000 బ్యారెళ్లు తగ్గించి, రోజుకు 103.51 మిలియన్‌ బ్యారెళ్లకు పరిమితమైందని ఒపెక్‌ తెలిపింది. అయితే ద్వితీయార్ధంలో మాత్రం రోజుకు 50,000 బ్యారెళ్ల మేర గిరాకీ అధికమవుతుందని అంచనా వేస్తోంది.


ఎంసీఎల్‌ఆర్‌ను పెంచిన ఎస్‌బీఐ

ఈనాడు, హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిధుల ఆధారిత రుణ వడ్డీ రేట్లు (ఎంసీఎల్‌ఆర్‌) పెంచింది. కొత్త రేట్లు శనివారం (ఈనెల 15) నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అన్ని కాల వ్యవధులకు ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్ల మేరకు పెరిగింది. ఒక రోజు    ఎంసీఎల్‌ఆర్‌ 8% నుంచి 8.10 శాతానికి చేరింది. నెల- మూడు నెలల వడ్డీ రేటు      8.20% నుంచి 8.30 శాతంగా మారింది. ఆరు నెలల వ్యవధికి ఎంసీఎల్‌ఆర్‌ 8.55% నుంచి 8.65 శాతం, ఏడాది కాలానికి     8.65 శాతం నుంచి 8.75 శాతం, రెండేళ్ల వ్యవధికి 8.75 శాతం నుంచి 8.85%, మూడేళ్ల వడ్డీ రేటు 8.85% నుంచి 8.95 శాతం అయ్యాయి. కొన్ని గృహరుణాలు, వాహన రుణాలు ఏడాది ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ వడ్డీ రేటు ఆధారంగా ఉన్న రుణాలపై వడ్డీ భారం పెరగనుంది.


సెబీకి ఐపీఓ పత్రాలు సమర్పించిన హ్యుందాయ్‌

దిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ తన తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) కోసం సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. 3 బిలియన్‌ డాలర్ల (సుమారు       రూ.25,000 కోట్లు) నిధుల్ని సమీకరించేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ ఐపీఓకు సెబీ నుంచి ఆమోదం లభిస్తే, ఎల్‌ఐసీ ఐపీఓ (రూ.21,000 కోట్లు)ను అధిగమించి దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా నిలుస్తుంది. ముసాయిదా పత్రాల ప్రకారం, ఈ ఐపీఓ మొత్తం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో జరగనుంది. 14.21 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ఉండదు. 1996లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 13 మోడళ్లను విక్రయిస్తోంది. 2023 మే నెలతో (59,601 వాహనాలు) పోలిస్తే గత మే నెలలో 7% వృద్ధితో 63,551 వాహనాలను విక్రయించింది. రెండు దశాబ్దాల తర్వాత స్టాక్‌ మార్కెట్లలోకి వస్తున్న తొలి వాహన సంస్థ కూడా ఇదే కానుంది. 2003లో మారుతీ సుజుకీ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన సంగతి తెలిసిందే.


ఐపీఓకు గోదావరి బయోరిఫైనరీస్‌

దిల్లీ: ఇథనాల్, బయో ఆధారిత రసాయనాల తయారీ సంస్థ గోదావరి బయోరిఫైనరీస్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు రాబోతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీకి శనివారం సమర్పించింది. ఈ ఐపీఓలో తాజా షేర్ల జారీ ద్వారా రూ.325 కోట్ల నిధులు సమీకరించనుంది. అలాగే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో 65.27 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, పెట్టుబడిదార్లు విక్రయించబోతున్నారు. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ మండాలా క్యాపిటల్‌ ఏజీ లిమిటెడ్‌ ఓఎఫ్‌ఎస్‌లో 49.27 లక్షల షేర్లను విక్రయించబోతోంది. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.240 కోట్లను రుణ చెల్లింపుల కోసం సంస్థ వినియోగించనుంది. మిగతా నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వాడనుంది. మహారాష్ట్రకు చెందిన గోదావరి బయోరిఫైనరీస్, మన దేశంలో ఇథనాల్‌ ఆధారిత రసాయనాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో ఒకటి. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, ఈక్విరస్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఈ ఇష్యూకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.


బ్రైట్‌కామ్‌ షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత

ఈనాడు, హైదరాబాద్‌: స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో బ్రైట్‌కామ్‌ గ్రూపు (బీసీజీ) షేర్ల ట్రేడింగ్‌ నిలిచిపోయింది. తగిన గడువు లోపు త్రైమాసిక, వార్షిక ఆర్థిక ఫలితాలు ప్రకటించకపోవడం, ఫలితాలను స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించకపోవడంతో పాటు మరికొన్ని ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని బీసీజీ షేర్ల ట్రేడింగ్‌ను సస్పెండ్‌ చేయాలని ఎక్స్ఛేంజీలు నిర్ణయించాయి. దీనిపై బ్రైట్‌కామ్‌ శనివారం     ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. ఇంతకు ముందు ఉన్న ఆడిటర్‌ రాజీనామా చేయటం వల్ల ఇబ్బంది తలెత్తినట్లు, కొత్తగా ఆడిటర్‌ను నియమించినప్పటికీ స్టాండలోన్‌ ఫలితాలు మాత్రమే సిద్ధం చేయగలిగినట్లు, కన్సాలిడేటెడ్‌ ఫలితాల ప్రకటన సాధ్యం కాలేదని కంపెనీ పేర్కొంది. బ్రైట్‌కామ్‌ గ్రూపు వ్యాపారాన్ని అధికంగా తన సబ్సిడరీ కంపెనీల ద్వారా వివిధ దేశాల్లో నిర్వహిస్తోంది. దీంతో ఆయా దేశాల్లోని అకౌంటింగ్‌ నిబంధనలకు అనుగుణంగా లెక్కలు ఖరారు చేయడానికి సమయం తీసుకుంటున్నట్లు వివరించింది. అందువల్ల గత ఆర్థిక సంవత్సరం రెండు, మూడు త్రైమాసికాలకు ఫలితాలు ఖరారు చేయలేకపోయినట్లు పేర్కొంది. వచ్చే నెలాఖరు నాటికి కన్సాలిడేటెడ్‌ ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోపక్క కంపెనీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వల్ల సీఎఫ్‌ఓ, కంపెనీ సెక్రటరీలను నియమించడం సాధ్యపడలేదని వివరించింది. అయినప్పటికీ తగిన అర్హతలు ఉన్న సీఎఫ్‌ఓ, కంపెనీ సెక్రటరీ కోసం అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.


తుది దశకు డేటా రక్షణ చట్టం! 
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి వైష్ణవ్‌ 

దిల్లీ: డేటా రక్షణ చట్టం నిబంధనల రూపకల్పన తుది దశకు చేరిందని, త్వరలోనే పరిశ్రమతో సంప్రదింపులు జరుపుతామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. మోదీ 3.0 ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిని రెట్టింపు చేయడంతో పాటు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మైక్రాన్, టాటా గ్రూప్‌ సెమీ కండక్టర్‌ ప్లాంట్లు అనుకున్నట్లుగా ముందుకు సాగుతున్నాయన్నారు. డిజిటల్‌-బై-డిజైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్టం అమలు చేసే ప్రక్రియ మొదలుపెడతామన్నారు. ఇందుకోసం ఎన్‌ఐసీ, డీఐసీలతో అలాంటి ప్లాట్‌ఫామ్‌ లేదా పోర్టల్‌ తీసుకొస్తామని తెలిపారు. గతేడాది ఆగస్టులో పార్లమెంట్‌ డీపీడీపీ చట్టాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. భారతీయ పౌరుల వ్యక్తిగత డేటాను సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఏవైనా సంస్థలు వ్యక్తిగత డిజిటల్‌ డేటాను దుర్వినియోగపరిచినా, సంరక్షించడంలో విఫలమైనా రూ.250 కోట్ల వరకు పెనాల్టీ విధించే ప్రతిపాదన కూడా ఈ చట్టంలో ఉంది.


ముడి చమురుపై విండ్‌ఫాల్‌ పన్ను తగ్గింపు

దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై విండ్‌ఫాల్‌ పన్నును టన్నుకు రూ.3,250కు ప్రభుత్వం తగ్గించింది. ఇంతకు మునుపు ఇది రూ.5,200గా ఉండేది. శనివారం (15న) నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం (ఎస్‌ఏఈడీ) రూపంలో ఈ విండ్‌ఫాల్‌ పన్నును విధిస్తారు. డీజిల్, పెట్రోలు, విమాన ఇంధనం ఎగుమతులపై ఈ పన్ను ‘సున్నా’గా ఉంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు