అవిన్యా బ్రాండ్‌పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు

టాటా మోటార్స్,  ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్‌పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం.

Published : 16 Jun 2024 02:50 IST

30 నిమిషాల ఛార్జింగ్‌తో కనీసం 500 కిలోమీటర్ల ప్రయాణం

దిల్లీ: టాటా మోటార్స్,  ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్‌పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. అవిన్యా వాహనాల్లో వినియోగించే బ్యాటరీలు, అతి త్వరగా ఛార్జింగ్‌కు అనువుగా ఉంటాయని, 30 నిమిషాల ఛార్జింగ్‌తోనే కనీసం 500 కిలోమీటర్లు ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అవిన్యా కాన్సెప్ట్‌ విద్యుత్తు కారును 2022 ఏప్రిల్‌లో టాటా మోటార్స్‌ ప్రదర్శించిన సంగతి విదితమే. సంస్కృత పదమైన అవిన్యాకు అర్థం వినూత్నత. 2025లో అవిన్యా కారును విపణిలోకి విడుదల చేస్తామని అప్పట్లో సంస్థ ప్రకటించింది. అయితే ఈ పేరుపై ఒక విద్యుత్తు కారును ఆవిష్కరించడంతో సరిపెట్టుకోక, ఈ పేరునే విద్యుత్తు కార్లకు బ్రాండ్‌గా వినియోగించాలని టాటా మోటార్స్‌ భావిస్తున్నట్లు ఆటో కార్‌ ఇండియా పేర్కొంది. ఈ బ్రాండ్‌పై పలు వాహనాలను ఆవిష్కరిస్తామని టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ వివేక్‌ శ్రీవత్స వెల్లడించారు. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ లక్షణాలు, స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల్లో ఉండే విలాసవంత - బహుముఖ సదుపాయాలు, బహుళ వినియోగ వాహన తరహా పనితీరు కలిసి ఉండేలా, ‘సరికొత్త, అందమైన వినూత్న’ విద్యుత్తు వాహనాలను అవిన్యా బ్రాండ్‌పై ఆవిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్ల ముందు, వెనుక కొత్త గుర్తింపును అమర్చుతామని వివరించారు. బటర్‌ఫ్లై డోర్లు ఈ వాహనాలకు ఏర్పాటు చేస్తామని, ఇందువల్ల కారులోకి ఎక్కడం బాగుంటుందని, లోపల కూడా ఎక్కువ ఖాళీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి భద్రతా ప్రమాణాలు, నీరు-దుమ్ము నుంచి అధిక రక్షణ కల్పిస్తూ, అన్ని ప్రాంతాల వినియోగదారులకు అనువుగా తదుపరి తరం ముడిపదార్థాలతో ఈ వాహనాలను రూపొందిస్తామని వివరించారు. తక్కువ బరువుతో, అధిక సామర్థ్యంతో పనిచేసేలా ఈ వాహనాలు ఉంటాయని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని