తాజా ఉత్తీర్ణులకు హుషారే

గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్‌) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది.

Published : 16 Jun 2024 02:56 IST

6 నెలల్లో నియామకాలు 5% పెరిగాయ్‌
ఐటీ రంగ పరిస్థితి మెరుగవుతున్నందునే: ఫౌండిట్‌

దిల్లీ: గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్‌) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. తాజా ఉత్తీర్ణుల నియామకాల ధోరణిపై ఫౌండిట్‌ (ఇంతకుమునుపు ఏపీఏసీ అండ్‌ ఎంఈ) ఈ నివేదికను విడుదల చేసింది. 2023 మే నుంచి 2024 మే వరకు ఫౌండిట్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదైన ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించి, దీన్ని రూపొందించింది.

  • ప్రారంభ స్థాయి వృత్తి నిపుణులకు సంబంధించిన మొత్తం నియామకాల ప్రకటనల్లో ఐటీ రంగానివి 32%, స్టాఫింగ్‌ ఇండస్ట్రీవి 12%.
  • గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణులకు గిరాకీ 5% పెరిగింది. 
  • హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోని కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఐటీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుండటం, వ్యయ నియంత్రణ చర్యలు లాంటివి నియామకాల ధోరణుల్లో మార్పునకు కారణం.
  • అంకురాలకొస్తే ఐటీ సేవల రంగంలోనివి 23%, ఇంటర్నెట్‌ సేవలందించేవి 22% ఉద్యోగాలను తాజా పట్టభద్రులకు కేటాయించాయి. 
  • గత త్రైమాసికంలో ఐటీ పరిశ్రమలో నియామకాలు తగ్గినా, అంకుర సంస్థల్లో ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు గిరాకీ బాగానే ఉంది. వీరి కోసం వచ్చిన నియామకాల ప్రకటనల్లో అంకురాల నుంచే 28% ఉన్నాయి.
  • అంకురాల నుంచి ఇతర ఉద్యోగాల కోసం వచ్చిన ప్రకటనల్లో కన్సల్టెంట్లు (10%), సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌/ మేనేజర్‌ (4%), ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌/ మేనేజర్‌ (4%) హోదాలవి ఉన్నాయి. 
  • తాజా ఉత్తీర్ణులకు సంబంధించి వచ్చిన నియామక ప్రకటనల్లో దిల్లీ- ఎన్‌సీఆర్‌ది (21%) అత్యధిక వాటా కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు (14%), ముంబయి (8%), చెన్నై (8%), పుణె (8%), హైదరాబాద్‌ (8%) ఉన్నాయి. 
  • ‘చదువుకునే సమయంలో సముపార్జించిన నైపుణ్యాపైనే అంకురాలు సహా కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువల్ల అధునాతన నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై యువ వృత్తి నిపుణులు దృష్టి సారించాల’ని ఫౌండిట్‌ సీఈఓ శేఖర్‌ గరిసా తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని