రుణ మంజూరులో 14-15% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రుణ మంజూరు 14-15% పెరుగుతుందని ఆశిస్తున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా పేర్కొన్నారు.

Published : 18 Jun 2024 03:18 IST

ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా అంచనా

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రుణ మంజూరు 14-15% పెరుగుతుందని ఆశిస్తున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా పేర్కొన్నారు. సాధారణంగా దేశ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ శాతం కలిపిన దానికి మరో 2-3% జతచేస్తే.. అది రుణాల్లో వృద్ధిగా భావించొచ్చని, ప్రస్తుతం అది దాదాపు 14 శాతంగా ఉందని అన్నారు. ప్రస్తుతం రుణాల వృద్ధిపై సంతృప్తికరంగా ఉన్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు 11% వృద్ధి చెందాయని వెల్లడించారు. ప్రస్తుతం బ్యాంక్‌కు అదనంగా చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌) రూ.3.5- 4 లక్షల కోట్ల మేర ఉంది. రుణాలు- డిపాజిట్‌ నిష్పత్తి దాదాపు 68-69 శాతంగానే ఉన్నందున, నిధుల సమీకరణకు డిపాజిట్‌ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని దినేశ్‌ ఖారా వివరించారు. ‘మేము ఎల్లప్పుడూ డిపాజిట్లకు ప్రాధాన్యత ఇస్తాం. అందుకే స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాం. డిపాజిట్ల వృద్ధి రేటు మెరుగుపరుచుకోనున్నాం. ఈ ఏడాది డిపాజిట్లలో వృద్ధి 12-13% ఆశిస్తున్నామ’ని అన్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం), 2023-24లో మాదిరిగానే లేదా మరో 2-3 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడొచ్చని ఖారా అంచనా వేశారు. 2023-24లో ఎన్‌ఐఎం 15 బేసిస్‌ పాయింట్లు తగ్గి 3.28 శాతంగా నమోదైంది. నికర, స్థూల నిరర్థక ఆస్తులు తగ్గాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని అంచనా వేయడం కష్టతరమని అభిప్రాయపడ్డారు. 2022-23తో పోలిస్తే 2023-24లో బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 0.54% తగ్గి 2.24 శాతానికి పరిమితం అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని