నూడుల్స్‌.. సబ్బుల ధరలు పెరుగుతున్నాయ్‌!

నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల వంటి ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచేశాయ్‌ కూడా.

Updated : 18 Jun 2024 03:33 IST

ముడి పదార్థాల వ్యయాల వల్లే: కంపెనీలు

దిల్లీ: నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల వంటి ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచేశాయ్‌ కూడా. ముడి పదార్థాల వ్యయాలు పెరగడంతో, మార్జిన్లను కాపాడుకునేందుకు, ఉత్పత్తుల ధరల పెంపు తప్పట్లేదని కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నాయి. సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2-9%, కేశ సంరక్షణ నూనెల ధరలు 8-11%, ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు 3-17% పెరుగుతున్నాయని సమాచారం. ఫలితంగా కుటుంబ నెలవారీ వ్యయాలు అధికమవుతున్నాయి. 

2022తో పాటు 2023 ప్రారంభంలోనూ కమొడిటీ ధరలు పెరిగాయంటూ కొంత భారాన్ని వినియోగదార్లకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు బదలాయించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఉత్పత్తుల ధరలు పెద్దగా పెంచలేదు. ఇప్పుడు చూస్తే గతంలో కంటే ముడి చమురు, పామాయిల్‌ ధరలు తగ్గినా, పాలు, చక్కెర, కాఫీ, కోప్రా, బార్లీ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తుల ధరల పెంపునకు కంపెనీలు ఉపక్రమించాయి. 

ధరల పెంపు ఇలా..: టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ పోటీ సంస్థలకు అనుగుణంగా, తమ ఉత్పత్తుల ధరల సవరింపు ప్రక్రియ చేపట్టింది. స్వల్పకాలంలో కమొడిటీ ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకుని, ధరల్ని సవరించబోమని హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) తెలిపింది. అయితే డోవ్‌ సబ్బుల ధరల్ని ఈ కంపెనీ 2% పెంచింది. డాబర్‌ ఇండియా, ఇమామీ సంస్థలు ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలను  1-5% మధ్య పెంచుతామని ప్రకటించాయి. గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ సబ్బుల ధరను    4-5%  పెంచింది. విప్రో తన సంతూర్‌ సబ్బుల ధరల్ని 3% పెంచింది. కోల్గేట్‌ పామోలివ్‌ బాడీ వాష్‌ ధరలను పెంచింది. హెచ్‌యూఎల్, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ హైజీన్‌ అండ్‌ హెల్త్‌కేర్, జ్యోతి ల్యాబ్స్‌ తమ డిటర్జెంట్ల ధరలను 1-10% పెంచాయి. హెచ్‌యూఎల్‌ షాంపూ, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను 4% వరకు పెంచింది. నెస్లే కాఫీ ధరలను 8-13% పెంచింది. మ్యాగీ ఓట్స్‌ నూడుల్స్‌ ధరలను ఏకంగా 17% పెంచింది. ఐటీసీ ఆశీర్వాద్‌ హోల్‌ వీట్‌ (గోధుమ పిండి) ధరలను 1-5% పెంచింది. బికాజీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2-4% ధరలు పెంచే ప్రక్రియను చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని