75500- 76300 ఎగువన లాభాల్లోనే!

దేశీయ సంకేతాల మద్దతుతో గతవారం సూచీలు, జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. విదేశీ మదుపర్లతో పాటు డీఐఐలు కూడా కొనుగోళ్లకు దిగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.

Updated : 18 Jun 2024 03:32 IST

సమీక్ష: దేశీయ సంకేతాల మద్దతుతో గతవారం సూచీలు, జీవనకాల తాజా గరిష్ఠాలకు చేరాయి. విదేశీ మదుపర్లతో పాటు డీఐఐలు కూడా కొనుగోళ్లకు దిగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. అయితే ముడిచమురు ధరలు పుంజుకోవడం అప్రమత్తతకు కారణమైంది. దేశీయంగా చూస్తే.. మేలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠమైన 4.75 శాతానికి తగ్గింది. టోకు ద్రవ్యోల్బణం మాత్రం 2.6 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి మూడు నెలల కనిష్ఠమైన 5 శాతానికి పరిమితమైంది. వచ్చే మూడేళ్లలో 6.7% వృద్ధి రేటు సాధించే అవకాశం భారత్‌కు ఉందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 3.8% లాభంతో 82.6 డాలర్లకు చేరింది. చమురు గిరాకీ పెరగొచ్చన్న ఐఈఏ, ఒపెక్‌ అంచనాలు ఇందుకు నేపథ్యం. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.55 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా.. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వరుసగా ఏడో సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ ఏడాదిలో ఒకసారి మాత్రం రేట్ల కోతకు అవకాశం ఉందనే సంకేతాలిచ్చింది. మేలో అమెరికా ద్రవ్యోల్బణం 3.3 శాతంగా నమోదైంది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ కూడా వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదు. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.4% లాభంతో 76,993 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.8% పెరిగి 23,466 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో యంత్ర పరికరాలు, స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువులు లాభపడగా.. ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.2,031 కోట్ల విలువైన షేర్లను, డీఐఐలు రూ.6,294 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.3,064 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 9:7గా నమోదు కావడం..
ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం సెన్సెక్స్‌ 77,145 పాయింట్ల దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. స్వల్పకాలంలో సూచీ 75,500- 76,300 పాయింట్ల ఎగువన ట్రేడైనంత వరకు లాభాలు కొనసాగే అవకాశం ఉంది. 75,500 పాయింట్ల దిగువకు చేరితే మాత్రం స్థిరీకరణకు అవకాశం ఉంటుంది.  

ప్రభావిత అంశాలు: సోమవారం బక్రీద్‌ సెలవు కావడంతో ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు. కార్పొరేట్‌ వార్తలు, వార్షిక సాధారణ సమావేశాల (ఏజీఎం) నేపథ్యంలో షేరు/రంగం ఆధారిత కదలికలు ఉండొచ్చు. రుతుపవనాల పురోగతి, వార్తలు కీలకం కానున్నాయి. వర్షపాతం తక్కువగా నమోదైతే, సెంటిమెంట్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనల కోసం మదుపర్లు ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో సాధారణ బడ్జెట్‌ వరకు కీలక పరిణామాలు లేకపోవడంతో మార్కెట్ల స్థిరీకరణకూ అవకాశం ఉంది. అంతర్జాతీయంగా.. అమెరికా, చైనా పారిశ్రామికోత్పత్తి, యూరో ఏరియా వినియోగదారు విశ్వాసం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం, అమెరికా తయారీ పీఎంఐ, అమెరికా రిటైల్‌ విక్రయాలపై దృష్టిపెట్టొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. చమురు ధరలు మరింత పెరిగితే మార్కెట్ల లాభాలకు కళ్లెం పడొచ్చు. 

తక్షణ మద్దతు స్థాయులు: 76,296, 75,678, 74,941
తక్షణ నిరోధ స్థాయులు: 77,400, 78,200, 79,000

సెన్సెక్స్‌ 75,500- 76,300 ఎగువన ట్రేడైతే లాభాలు కొనసాగించొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని